నీటితో నిండిన ఇత్తడి లేదా రాగి పాత్రకు పసుపు రాసి బొట్టు పెట్టి, తెలుగు లేదా ఎరుపు రంగు దారం చుట్టి ఆ పాత్రలో నీళ్లు నింపితే అది కలశ అవుతుంది. ఆ తర్వాత దానిపై మామిడి ఆకులు, కొబ్బరి కాయ, నూతన వస్త్రం ఉంచుతారు. కొందరు కలశలో బియ్యం కూడా వేస్తారు. అదే కలశ, అదే పూర్ణకుంభం అని కూడా అంటారు.
సంప్రదాయ బద్ధమైన కార్యక్రమాల్లో గృహ ప్రవేశం, వివాహం, నిత్య పూజ సహా పలు శుభ సందర్భాల్లో కలశ ఏర్పాటు చేస్తారు. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉంచుతారు.
కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రతీకగా చెబుతారు. ఇది అన్నింటికీ జీవన దాత. ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగా ఉన్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది.
అన్ని పుణ్య నదుల్లో నీరు, అన్ని వేదాల్లో జ్ఞానం తో పాటూ దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించిన తర్వాత అందులోని నీరుఅన్ని వైదికక్రియలకి వినియోగిస్తారు.
కలశం ముఖభాగంలో విష్ణుమూర్తి, కంఠంలో నీలకంఠుడు అంటే పరమ శివుడు, మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో మాత్రుకలు ఉంటారు.
కలశం గర్భంలో అంటే కలశంలోని జలంలో సమస్త సముద్రాలు, ఏడు ద్వీపాలతో కూడిన భూమి, నాలుగు వేదాలు, సకల దేవతలు కొలువై ఉంటారని అర్థం. అందుకే కలశలో నీటితో సంప్రోక్షణ చేస్తారు.
దేవాలయ కుంభాభిషేకాలు సహా ఎన్నో రకాల పూజలు కలశజలం అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు.
పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.
పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా, వారిపట్ల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నామని అర్థం
కలశారాధన వల్ల పాపాలు హరించి పవిత్రులం అవుతాయని విశ్వాసం. అందుకే ప్రతి శుభకార్యంలో కలశారాధన ఉంటుంది.