నెలసరిలో అధిక రక్తస్రావం ఎందుకు అవుతుంది? వేలాది మంది భారతీయ మహిళలను ప్రభావితం చేస్తున్న సమస్య ‘రక్తస్రావం అధికంగా జరగడం’. ఇలా అధికంగా రక్తస్రావం అయ్యే సమస్యను మెనోరాగియా అంటారు. భారీ రక్తస్రావంతో పాటు ఏడు రోజులు కన్నా ఎక్కువ కాలం పాటు నెలసరి ఉంటుంది. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి హార్మోన్ల అసమతుల్యత. గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఏర్పడడం వల్ల కూడా భారీ రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. గర్భాశయ లైనింగ్ పై చిన్నచిన్న గడ్డల్లా పాలిప్స్ పెరుగుతాయి. వీటి వల్ల కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. కొందరిలో రక్తం గడ్డ కట్టడాన్ని ప్రభావితం చూసే కొన్ని వైద్య పరిస్థితులు ఉంటాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్న వారిలో పునరుత్పత్తి అవయవాల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనితో అధిక రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అధికంగా రక్తస్రావం జరగడం వల్ల ఇనుము వంటి ముఖ్యమైన పోషకాలు బయటికి పోతాయి.