మధ్యాహ్న భోజనం సుష్టుగా తిన్నాక నిద్ర మత్తులో తూగుతుంటారు చాలా మంది.
తిన్న తరువాత ఎందుకింత నిద్ర మత్తు? అని ఎప్పుడైనా ఆలోచించారా? భుక్తాయాసంతో నిద్ర వస్తోంది అంటూ సర్ది చెప్పుకుంటారు చాలా మంది.
మధ్యాహ్నం మీరు ఏం తిన్నారన్న దానిపై నిద్రమత్తు వచ్చేది లేనిది ఆధార పడి ఉంటుంది.
మీరు మధ్యాహ్నం అన్నం ఎక్కువగా తింటే నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అన్నం తినడం వల్ల గ్లూకోజు వెంటనే రక్తంలో కలుస్తుంది. దీని వల్ల కాస్త అలసటగా అనిపిస్తుంది. ఆ అలసట వల్ల నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది.
అన్నం సుష్టుగా భోజనం చేయడం వల్ల మెలటోనిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి.
ఇవి మెదడును ప్రశాంతంగా ఉంచడంతో పాటూ, మత్తు భావనను కలిగిస్తాయి. అన్నమే కాదు, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఏ ఆహారాలు తిన్నా ఇలాగే ఉంటుంది.
మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉండాలంటే కార్బోహైడ్రేట్లు తక్కువుండే ఆహారాన్ని, ప్రొటీన్ ఎక్కువుండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్ వల్ల శరీరం చురుగ్గా పనిచేస్తుంది.