చలికాలం వచ్చిందంటే కొందరికి తరచూ జలుబు, ఫ్లూ వస్తూ ఉంటాయి. అది ఎందుకు తెలుసా? హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం చల్లని వాతావరణంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని వల్ల వైరస్ అంటుకుని నాసికా కణాలకి సోకుతుంది. అక్కడ నుంచి అవి ఇతర భాగాలకి చేరతాయి. ముక్కు లోపల ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గడం వల్ల వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడే కణాలలో దాదాపు 50 శాతం నశించిపోతాయి. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల సగం రోగనిరోధక శక్తిని కోల్పోతారని నిపుణులు వెల్లడించారు. అందుకే తమను తాము రక్షించుకోవడానికి చల్లనివాతావరణం సమయంలో ముఖానికి మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్స్ తో పోరాడగలిగే సామర్థ్యం ఉన్న ప్రోటీన్లతో కుడైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. వాతావరణంలో మార్పుల కారణంగా మరికొంతమంది అలర్జీలకి గురవుతారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే బయటకి వెళ్లొచ్చిన తర్వాత కళ్ళు, ముక్కు నేరుగా తాకకుండా చేతులు కడుక్కోవాలి. శ్వాస ఆడకపోవడం, నిరంతర ఛాతీ లేదా కడుపు నొప్పి, జ్వరం లేదా దగ్గు ఎక్కువగా రావడం కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి.