స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్‌ తెలుసు! అందుకే ఈ పొట్టి సందేశాల యాప్‌ లేని ఫోన్‌ అస్సలు ఉండదంటే అతిశయోక్తి కాదేమో!



చాలామంది వాట్సాప్‌ను రాతపూర్వక సందేశాలు పంపించేందుకే ఉపయోగిస్తారు. అదే స్థాయిలో వాయిస్‌ మెసేజ్‌లనూ పంపించేవాళ్లు ఉంటారు.



తమకు ప్రియమైన వారికి పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వాయిస్‌ సందేశాలను ఉపయోగిస్తుంటారు. మరికొందరు తమ చిన్నారుల ముద్దు ముద్దు మాటలను వింటుంటారు.



టెక్ట్స్‌ టైప్‌ చేయలేని పెద్దలు, నిరక్షరాస్యులు చెప్పాలనుకున్న వివరాలను వాయిస్‌ ద్వారా పంపిస్తారు. ఇలా చేసేటప్పుడు ఒక సమస్య ఎదురవుతుంటుంది.



మాటలు తడబడ్డా, తప్పు పలికినా, సరిగ్గా రికార్డు చేయకపోయినా అవతలివారికి పంపించే సందేశం ఇబ్బంది కరంగా ఉంటుంది. కొన్నిసార్లు తప్పుడు అర్థాలు వచ్చి అనర్థాలకు దారితీస్తాయి.



అందుకే వాట్సాప్‌ తాజాగా మరో అప్‌డేట్‌ తీసుకొచ్చింది. వాయిస్‌ మెసేజ్‌ ప్రివ్యూ ఫీచర్‌ను అందిస్తోంది.



దీంతో మీరు రికార్డు చేసిన సందేశాలను మొదట మీరు విని సరిగ్గా ఉన్నాయనుకుంటేనే అవతలి వారికి సెండ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, వెబ్‌, డెస్క్‌టాప్‌ అన్ని వెర్షన్లలోనూ ఇది పనిచేస్తుంది.



రికార్డింగ్‌ ముగించేందుకు స్టాప్‌ బటన్‌ ప్రెస్‌ చేసిన వెంటనే ప్రివ్యూ వాయిస్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. ఆ తర్వాత త్రిభుజాకార ప్లే ఐకాన్‌ టచ్‌ చేసి సందేశాన్ని వినొచ్చు. బాగా ఉందనిపిస్తే పంపించొచ్చు.



లేదంటే డిలీట్‌ చేసి, మళ్లీ రికార్డు చేసి సెండ్‌ చేయొచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారం వాబీటా బ్లాగులో ఉంచింది వాట్సాప్‌.