ఈ ఏడాది (2023) వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!



ఈ ఏడాది అధిక శ్రావణం వచ్చింది. అంటే శ్రావణమాసం 2 నెలలు ఉంటుంది. శ్రావణంలో నోములు, వ్రతాలు చాలా ఉంటాయి. ఇంతకీ అవన్నీ ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం ఉండేవారికోసమే ఈ వివరణ



పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రవణం అనే పేరొచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం జులై 18వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది.



ఈ సంవత్సరం అధికమాసం కావడం వల్ల మొదట వచ్చేది అధిక శ్రావణమాసం అంటారు. నిజ శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి మొదలై సెప్టెంబరు 15 వరకూ ఉంటుంది.



దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణం.ఈ నెలలో లక్ష్మీఆరాధన, గౌరీ ఆరాధనతో పాటూ శివారాధన అత్యంత పుణ్యఫలం అని భావిస్తారు భక్తులు.



శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం చేసేవారికోసం ఈ ఏడాది నాలుగు మంగళవారాలు( ఆగస్టు 22, 29 సెప్టెంబరు 4, 11) మాత్రమే వచ్చాయి. శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 25న వచ్చింది.



అధిక మాసం అనుష్ఠానాలకు, జపతపాలకు విశిష్టమైంది. యధాశక్తి దాన ధర్మాలు, సంతర్పణలు చేయడం మంచిది. పితృకార్యాలు మాత్రం యథావిధిగా నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది.



నిజమాసంలో జరిగే పూజలు, నోములేవీ అధికమాసంలో నిర్వహించరు. అందుకే మంగళగౌరి వ్రతం ఆచరించేవారు, శ్రావణశుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేవారు నిజ శ్రావణంలోనే చేస్తారు.



శ్రావణమాసం అంటే కేవలం అమ్మవారి పూజలు,నోములు మాత్రమే కాదు పరమేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం.



శ్రావణమాసంలో వచ్చే ప్రతిసోమవారం శివపూజ తప్పనిసరిగా చేయాలంటారు పండితులు. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉండడం వల్లే శుభకార్యాలు ఎక్కువగా శ్రావణంలో నిర్వహిస్తారు.



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest