ఎంత నవ్వితే అంత ఆయుష్షు ప్రపంచంలోనే అత్యంత చవకైన ఔషధం నవ్వే. నవ్వితే ఎన్ని సమస్యలైనా ఇట్టే ఆవిరైపోతాయని అంటారు. దీర్ఘ కాలంగా ధ్యానం చేసే వారిలో ఎంత మంచి మార్పులు కలుగుతాయో, నవ్వే వారిలో కూడా ఆ మార్పులే కలుగుతాయి. నవ్వు నరాలలో ఆక్సిజన్ సమృద్ధిగా అందేలా చేస్తుంది. అలాగే గుండె, ఊపిరితిత్తులు, కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో ఎండార్పిన్లు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది. ఒత్తిడికి గురైనప్పుడల్లా మీ మెదడు ఒత్తిడితో పోరాడటానికి న్యూరోపెప్టైడ్స్ అనే చిన్న అణువులను విడుదల చేస్తుంది. ఆ అణువులను అణచడానికి డోపమైన్, సెరటోనిన్, ఎండార్పిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లు అవసరం పడతాయి. నవ్వినప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్లా ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. అప్పుడు ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. నవ్వే సమయంలో లోతైన శ్వాసలను తీసుకుంటారు. అంటే దీని అర్థం ఆక్సిజన్ నిండిన రక్తం మీ శరీరంలోని ప్రతి భాగానికి చేరుతుందని. నవ్వడం వల్ల ఆరోగ్యంతో పాటూ ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే హాయిగా నవ్వండి.