ప్రపంచంలోనే మొదటి ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్‌ను హువావే ఇటీవలే లాంచ్ చేసింది. దానికి ‘హువావే మేట్ ఎక్స్‌టీ అల్టిమేట్ డిజైన్’ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన సేల్ చైనాలో ఇటీవలే ప్రారంభం అయింది. కానీ ప్రీ ఆర్డర్ చేసుకున్న వారికే దీన్ని విక్రయిస్తామని స్టోర్లకు వెళ్లిన వారికి చెబుతున్నారట. దీంతో ఈ ఫోన్‌కు బ్లాక్ మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ ఫోన్ ధర 19,999 చైనీస్ యువాన్ల (సుమారు రూ.2.37 లక్షలు) నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర 23,999 చైనీస్ యువాన్లుగా (సుమారు రూ.2.84 లక్షలు) ఉంది. కానీ టాప్ ఎండ్ వేరియంట్‌ను బ్లాక్‌లో ఏకంగా 1.5 లక్షల చైనీస్ యువాన్లకు విక్రయిస్తున్నారట. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.17.77 లక్షలు. అంత ధర పెట్టినా ఈ ఫోన్‌ను యూజర్లు కొంటున్నారని తెలుస్తోంది.