కొత్త బట్టలకు పసుపు పెట్టకుండా వేసుకుంటే ఏమవుతుంది!



చర్మరోగాల నుంచి క్యాన్సర్‌ వరకూ పసుపు ఎన్నో రోగాలకు దివ్యౌషధం అంటూ పరిశోధనల్లో తేలింది. ఇలాంటి పసుపుని భారతీయులు తమ జీవితంలోనే ఒక భాగంగా మార్చేసుకున్నారు.



ఏ శుభకార్యం వచ్చినా పసుపుదే పైచేయి..అంతెందుకు కొత్త బట్టలు వేసుకునేటప్పుడు కూడా పసుపు తప్పనిసరిగా పెడతారు.. ఎందుకంటే



కొత్త బట్టలని ఉతకకుండానే వేసుకుంటాం.. బట్టల తయారీలో రకరకాల రసాయనాలని వాడేస్తున్నారు. అలాగే పూర్వకాలంలోనూ గంజి, అద్దకాలతో బట్టలను రూపొందించేవారు.



రసాయనాలైనా, గంజి వంటి పదార్థాలైనా నిలువ ఉన్నప్పుడు తప్పకుండా క్రిములకు ఆస్కారం ఇచ్చేవే. కొత్తబట్టలకు పసుపుని రాయడం వల్ల వాటి మీద ఉన్న సూక్ష్మక్రిములను కొంతవరకైనా నాశనం చేసే అవకాశం ఉంటుంది.



కొత్త బట్టలు గోదాముల్లో నెలల తరబడి ఉన్నా ముక్కవాసన వస్తాయి. ఈ వాసనను పసుపు కొంతవరకూ నిలువరిస్తుంది.



కొత్తబట్టలు అప్పట్లో కేవలం పండుగలు, పెళ్లళ్లు, శుభకార్యాలకు మాత్రమే వేసుకునేవారు. పసుపు లేనిదే మన సంప్రదాయంలో ఏ శుభకార్యమూ గడవదు కదా. ఆ శుభ సందర్భంగా బట్టలు కొనడంతో వాటికి కూడా శుభసూచకంగా పసుపు పెడతారు



బట్టలను జాడించిన ప్రతిసారీ పసుపు కాస్త కాస్తగా కరుగుతూ తనలోని క్రిమిసంహారక లక్షణాన్ని బట్టలకు అందిస్తుంది.



కొత్త బట్టలు వేసుకుని వెళ్తే అందరి కళ్లూ వారి మీదే ఉండటం ఖాయం. అందుకని బట్టలకు పసుపుని తాకించడం వల్ల పలువురి దృష్టి పడటం వల్ల కలిగే దోషాలను నివారిస్తుందని పెద్దల నమ్మకం.



పసుపంటే బంగారు వర్ణం. అది వైభవానికీ, భగవంతుని మహిమకూ చిహ్నం. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు, దైవదర్శనానికి వెళ్లేటప్పుడు పసుపు బట్టలు ధరించి వెళ్లాలంటారు.



కొత్తబట్టలకు కాసింత పసుపుని జోడిస్తే అది కూడా పీతాంబరంగానే మారిపోతుంది. జీవితమనే వైభవానికి తీపి గుర్తుగా మిగిలిపోతుంది.