పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక ఇంత అర్థం ఉందా!
ఇప్పుడంటే పెళ్లిచేసుకోబోయే అమ్మాయి అబ్బాయి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు కానీ ఒకప్పుడు పెళ్లి చూపుల తర్వాత మళ్లీ పెళ్లిరోజు వరకూ కలుసుకోనిచ్చేవారు కాదు
పెళ్లి జరుగుతున్నప్పుడు వధూవరుల మధ్య ఓ తెరను ఉంచుతారు. ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం ఉంచిన తరువాతే వారి మధ్య ఉన్న తెరని తొలగిస్తారు.
తెరను తొలగించిన వెంటనే ఒకరి భృకుటిని మరొకరు చూడాలని చెబుతారు. వధూవరుల స్పర్శ, చూపు...రెండూ కూడా శుభ్రప్రదంగా ఉండేందుకే ఈ నియమం
జీలకర్ర, బెల్లం రెండింటికీ వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. బెల్లం ఎలాంటి అవశేషమూ మిగల్చకుండా కరిగిపోతుంది.జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పూ లేకుండానే, తనని అంటిపెట్టుకుని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది.
వివాహబంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే, ఎవరి అస్తితత్వాన్ని వారు నిలుపుకోవాలనీ.. తనలోని సద్గుణాలని ఎదుటివారికి అందించాలనీ ఈ రెండు పదార్థాల కలయికా చెబుతుంది.
భార్యా, భర్తా కూడా వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగినవారైనప్పటికీ... ఎటువంటి సమస్యనైనా కలిసి ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది.
జీలకర్ర, బెల్లం ఈ రెండూ పూర్తి భిన్నమైన పదార్థాలు. కానీ రెండింటినీ కలిపి పుచ్చుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తీరిపోతాయంటుంది వైద్యశాస్త్రం
జీలకర్ర, బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలనీ మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుంది
పెళ్లి ముహూర్తం అంటే జీలకర్ర, బెల్లం పెట్టే సమయమే! అందుకే ‘’ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః/ ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్ వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు.