పిల్లల కోసం స్నాక్స్ ఏం తయారుచేయాలో అర్థం కావడం లేదా... కొన్ని ఐడియాలు ఇవిగో...
ఎగ్ బ్రెడ్ ఫ్రై - గుడ్డును పగులగొట్టి కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి బాగా గిలకొట్టాలి. బ్రెడ్ స్లైస్‌లపై ఆ మిశ్రమాన్ని పోసి పెనంపై ఇటూ అటూ కాల్చాలి.
ఆమ్లెట్ - గుడ్డుసొనలో ఉల్లితరుగు, టమాటా తరుగు, కొత్తిమీర తరుగు, పసుపు, కారం,ఉప్పు వేసి ఆమ్లెట్‌ను మందంగా వేయాలి. దాన్ని ముక్కలుగా కోయాలి.
చిక్కీలు - బెల్లంలో నువ్వులు లేదా వేరుశెనగ పలుకులు వేసి చేసే చిక్కీల వల్ల పిల్లలకు ఐరన్ లభిస్తుంది.
సాండ్ విచ్ - నెయ్యిరాసి కాల్చిన బ్రెడ్ ముక్కల మధ్యలో కాస్త చీజ్, ఉల్లిపాయల ముక్కలు, టమాటా ముక్కలు, మొక్కజొన్న గింజలు వేసి సాండ్‌విచ్ లా పెట్టినా మంచిదే.
కొమ్ము శెనగల ఫ్రై - కొమ్ము శెనగలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన కాసేపు ఉడికించి, పోపు వేసి బాక్సుల్లో పెడితే, పిల్లల శరీరానికి అవసరమైన ఇనుము అందుతుంది.
ఫ్రూట్ సలాడ్ - ఒకేపండు పెడితే పిల్లలకు బోరింగ్‌గా అనిపించవచ్చు. అరటి, ఆపిల్, జామ, పైనాపిల్... ఇలా మూడు నాలుగు రకాల పండ్ల ముక్కలు కలిపి పెడితే వారికి ఆసక్తిగా ఉంటుంది.
మొక్కజొన్నగింజలు కారం - ఉడకబెట్టిన మొక్కజొన్న గింజల్లో కాస్త ఉప్పు, కారం కలిపి పెడితే మంచిదే. మొక్కజొన్న గింజలు శరీరాన్ని బలోపేతం చేస్తాయి.
బాయిల్డ్ ఎగ్ - ఉడకబెట్టిన గుడ్లను ముక్కలు చేసి పైన కొంచెం మిరియాల పొడి చల్లాలి. చలికాలంలో చాలా ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇది.
ఎగ్ రోల్స్ - గుడ్డుతో ఉక్కిరి (కీమా) చేసి పలుచటి చపాతీలో రోల్‌లా చుట్టి పెట్టండి. ఇలాగే వెజిటేరియన్ రోల్స్ కూడా చేయవచ్చు.