- మేం ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం. వెంటనే మీ కేవైసీ అప్‌డేట్ చేయకపోతే మీ ఖాతాలోని డబ్బు నిలిచిపోతుంది.
- మీరు కేవైసీ చేయించకపోవడం వల్ల మీ ఏటీఎం కార్డును బ్లాక్ చేస్తున్నాం. తిరిగి అన్‌బ్లాక్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లోనే కేవైసీ చేయించండి. మీకు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని మాకు చెప్పండి.
ఇలాంటి కాల్స్ ఈ రెండేళ్లలో కనీసం ఒక్కసారైనా మీకు వచ్చాయా? అయితే మీరో విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. భారత్ ఎక్కువగా జరుగుతున్న కుంభకోణం ఇదేనట!
దాని పేరే... ' మీ కస్టమర్ ఎవరో తెలుసుకోండి'. సంక్షిప్తంగా చెప్పాలంటే కేవైసీ స్కామ్ (KYC Scam).
దేశంలో ఎక్కువ మందిని మోసం చేసేందుకు మోసగాళ్లు కేవైసీ స్కామ్‌నే వాడుకుంటున్నారని గ్లోబల్ స్పామ్ రిపోర్టు - 2021 పేర్కొంది. భారతీయ రిజర్వు బ్యాంకు కేవైసీని తప్పనిసరి చేయడంతో దానిని అడ్డుపెట్టుకొని మోసగాళ్లు బ్యాంకు, వాలెట్లు, డిజిటల్ చెల్లింపుల యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ గ్లోబల్ స్పామ్ రిపోర్టులో ఇంకా ఏమేం తెలిశాయంటే..?
భారత్‌లో ఈ ఒక్క ఏడాదిలో ఒకే స్పామర్ ద్వారా 202 మిలియన్లకు పైగా స్పామ్ కాల్స్ వచ్చాయి. అంటే రోజుకు 6,64,000, గంటకు 27,000 కాల్స్ వచ్చాయి. ఈ ఏడాది ఇన్‌కమింగ్ స్పామ్ కాల్స్‌లో 93 శాతం సేల్స్ సంబంధిత విభాగాలకే చెందినవి.
సగటున ఒక యూజర్‌కు నెలకు 16.8 స్పామ్ కాల్స్ వస్తున్నాయి. కేవలం ట్రూకాలర్ యూజర్లకు అక్టోబర్లో వచ్చిన స్పామ్ కాల్సే 380 కోట్లకు పైగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 184.5 బిలియన్ కాల్స్, 586 బిలియన్ మెసేజ్‌లను ట్రూకాలర్ గుర్తించింది. అందులో 37.0 బిలియన్ స్పామ్ కాల్స్ గుర్తించి బ్లాక్ చేశారు. 182 బిలియన్ సందేశాలను బ్లాక్ చేశారు.
ప్రపంచంలో అత్యధిక స్పామ్ కాల్స్ పొందుతున్న దేశంగా బ్రెజిల్ నిలిచింది. సగటున ఒక్కో యూజర్ నెలకు 32.9 స్పామ్‌కాల్స్ అందుకుంటున్నారు. బ్రెజిల్ ఇలా నిలవడం వరుసగా ఇది నాలుగో సారి.