తిరుప్పావై అంటే ఏంటి, గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు.
సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన వ్రతమే తిరుప్పావై
ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.
శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగితేలే వారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన కుమార్తె గోదాదేవి.
జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్టు శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తుడు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికిందంటారు.
గోదాదేవి రచించిన 30 పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు.
మొదటి అయిదు పాశురాలు: ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి.
5 నుంచి 15 పాశురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు, శ్రీ మహావిష్ణువు అవతారాల గురించి ఉంటాయి.
15 నుంచి 20 పాశురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది.
20 నుంచి 30 పాశురాల్లో చివరి తొమ్మిది పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి.
ఆఖరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది.