జోకర్ మాల్వేర్ మరోసారి పంజా విసురుతోంది. గూగుల్ రక్షణ వలయాన్ని ఛేదించుకొని మరీ యాప్‌ల్లో ప్రవేశిస్తోంది.
గూగుల్ అధికారిక ప్లేస్టోర్‌లోకి వెళ్లి 15 పాపులర్ యాప్స్‌కు సోకినట్టు తెలిసింది. వీటిని వెంటనే తొలగించాలని మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రేడియో హెచ్చరించింది.
గతేడాదీ జోకర్ మాల్వేర్ యూజర్లను ఇబ్బంది పెట్టింది. ప్లేస్టోర్‌లోని కొన్ని యాప్స్‌లో చేరింది. ఎంతో కష్టపడి గూగుల్ ఆ మాల్వేర్‌ను తొలగించింది.
అయినప్పటికీ తన కోడ్‌ను మార్చుకొని గూగుల్ సెక్యూరిటీ కళ్లుగప్పి మళ్లీ ప్లేస్టోర్‌లోకి చేరుకుంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కైలోని టత్‌యానా షిష్కోవా అనే అనలిస్టు గూగుల్‌లో 14 యాప్‌లకు జోకర్ మాల్వేర్ సోకిందని ఇంతకు ముందే చెప్పారు.
తాజాగా 'కలర్ మెసేజ్' యాప్‌కు జోకర్ మాల్వేర్ సోకిందని ప్రేడియో తెలిపింది. ఈ అప్లికేషన్‌ను 5 లక్షల మంది ఉపయోగిస్తుండటం గమనార్హం.
ఈ అప్లికేషన్ రష్యన్ సర్వర్లతో అనుసంధానం అయినట్టు కనిపిస్తోందని ప్రేడియో పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఏడు యాప్‌లను మొబైల్స్ నుంచి తొలగించాలని సూచించింది.
జోకర్ మాల్వేర్ 'ఫ్లీస్‌వేర్' విభాగానికి చెందింది. ఈ మాల్వేర్ మనకు తెలియకుండానే డబ్బులను కొట్టేస్తుంది. మనకు సంబంధం లేని, అవసరం లేని ప్రీమియం సర్వీసులకు క్లిక్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సబ్‌స్క్రైబ్ చేయిస్తుంది.
ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్ యాడ్స్‌పై క్లిక్ చేసి అనుమతి లేకుండానే పెయిడ్ సర్వీసులను డబ్బులు చెల్లిస్తుంది. మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసేంత వరకు మీ డబ్బు పోయిందన్న విషయం గుర్తించలేరు.