శిశువుల కంటికి కాటుక పెట్టకూడదా? కాటుక, కాజల్, సుర్మా ఇవన్నీ కూడా కళ్ళకు పెట్టే ఒక సౌందర్య ఉత్పత్తి. సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ఇది చాలా ముఖ్యమైనది. చెడు దృష్టి నుండి బిడ్డలను కాపాడుకోవడం కోసం ఇలా కాటుకను పెడుతూ ఉంటారు. అయితే ఇలా నవజాత శిశువులకు కాటుకను పెట్టడం సురక్షితమేనా కాదా అన్నది తెలుసుకుందాం. వైద్యులు చంటి పిల్లలకు కాటుక పెట్టకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాటుక తయారీలో సీసం ఉండే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లల కళ్ళలో దురద, చికాకు వంటివి వస్తాయి. ఇంట్లో తయారు చేసే కాటుకలను వాడేవారు కూడా ఉన్నారు. కానీ ఇవి కూడా మంచిదే అని చెప్పే శాస్త్రీయ అధ్యయనాలు లేవు. కాటుక ఎలా తయారు చేసినా అందులో కార్బన్ ఉండే అవకాశం ఉంది. బయట దొరికే కాటుకలు అధికంగా బొగ్గుతో తయారుచేసినవే ఉంటాయి. బొగ్గు, కొబ్బరి నూనె ఉపయోగించి వాటిని తయారు చేస్తూ ఉంటారు. అలాంటి కాటుకను పిల్లలకు పెట్టడం మంచిది కాదు.