ప్రముఖ హీరోయిన్ నయనతార శనివారం (నవంబర్ 18వ తేదీ) నాడు 38వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ స్టేటస్‌ను నయనతార ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ‘జవాన్’తో బాలీవుడ్‌లో కూడా భారీ సక్సెస్ అందుకున్నారు. నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. సినిమాల కోసం దాన్ని నయనతారగా మార్చుకున్నారు. 2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళం సినిమాతో నయనతార ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 80 వరకు సినిమాల్లో చేశారు. ఇప్పుడు కూడా మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీంతోపాటు రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ లాంచ్ చేసి భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు కూడా.