గోళ్లు కొరికితే ఈ సమస్య రావడం ఖాయం ఎక్కువ మందికి ఉండే అలవాటు గోళ్లు కొరకడం. అది ఒక్కోసారి ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌కి కారణం కావచ్చు. గోరు చుట్టూ ఉండే చర్మానికి గాయం కలిగి చికాకు, మంట వస్తుంది. ఒక్కొక్కసారి ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌గా మారిపోతుంది. దీన్ని పరోనిచియా అని పిలుస్తారు. బ్యాక్టీరియా చర్మపు సందుల్లోంచి గోరు మడతల్లోకి ప్రవేశించి అక్కడ పెరగడం ప్రారంభమవుతుంది. పరోనిచియా ఎక్కువైతే జ్వరం, అలసట, మైకం వంటివి కమ్ముతాయి. ఇన్ఫెక్షన్ అధికమైతే నొప్పి తీవ్రమైపోతుంది. గోళ్లను కొరకడం, నోటితో తీయడం, అందం కోసం చేయించుకునే చికిత్సల వల్ల చర్మం దెబ్బతిని ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. గోరు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ చేతులను కడిగిన తర్వాత వెంటనే తుడుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. గోళ్లు కొరక కూడదు. మీరు వాడే నెయిల్ కట్టర్‌ను ఇతరులతో ఎప్పుడూ షేర్ చేసుకోకండి. చేతి గోళ్లు శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. గోళ్లను ఎక్కువసేపు నీటిలో నాననివ్వకూడదు.