నటులెందరో.. మహానటి మాత్రం ఆమెఒక్కరే. కనీసం 5 పదులు కూడా జీవించలేదు... అయితేనేం చిరస్థాయిగా నిలిచే నటనా కీర్తినార్జించారు మహానటి సావిత్రి.



సాటి నటులకు ఆమె అంటే గౌరవం, అభిమానం. సావిత్రిని తలుచుకుంటే చాలు నటన అదే వస్తుందంటారు.



వెండితెర సామ్రాజ్యానికి మకుటం లేని మహరాణిగా వెలిగిన ఆమె గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం చిర్రావూరులో 1936 డిసెంబరు 6న జన్మించింది. గురవయ్య- సుభద్రమ్మ దంపతులకు రెండో సంతానం సావిత్రి.



ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 'సంసారం' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు సావిత్రి. 'దేవదాసు', 'మిస్సమ్మ', 'మాయాబజార్' ఆమె కీర్తి పతాకంలో మైలురాళ్లు. ఏఎన్నార్ తో మూగమనసులు, ఎన్టీఆర్ తో దేవత, గుండమ్మకథ, గుడిగంటలు, కలసి ఉంటే కలదు సుఖం చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన సినిమాలు.



చిరంజీవి, చిన్నారిపాపలు, మాతృదేవత, వింత సంసారం సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తెలుగులో నటశిరోమణి, తమిళంలో కలమైమామిణి బిరుదులు ఆమె సొంతం.



వెండితెరపై ఆమె వెలుగును మించిన వాళ్లు ఇప్పటి వరకూ లేరు..రారు అన్నంతగా కీర్తినందుకుంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం సావిత్రి లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు అన్నంతలా ఉంటుంది.



సావిత్రి జీవితాన్ని మలుపు తిప్పిన పెళ్లి. కెరీర్ జోరుమీదున్నప్పుడే జెమినీ గణేషన్ ని ప్రేమ వివాహం చేసుకున్న సావిత్రి.



పెళ్లి తర్వాత మందుకి బానిసైన సావిత్రి. ఆఫర్లు తగ్గాయి, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం తెలియక మోసపోయారామె.



'మూగమనసులు' సినిమా తమిళంలో నిర్మించాలనుకుంది. గణేశన్ అభ్యంతరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు సావిత్రి.



ప్రేమించిన భర్త దూరమవడం ఆమె జీవితాన్నే మార్చేసింది. పతనం ప్రారంభమైంది. తాగుడుకు బానిసైంది. రీల్ లైఫ్ లో అద్భుతంగా జీవించడం తెలిసిన వెండితెర సామ్రాజ్జికి రియల్ లైఫ్ లో నటించడం రాలేదు.



మత్తు నుంచి బయటపడి మళ్లీ నటించడం మొదలెట్టినా కోలుకోలేకపోయింది. డయాబెటిక్ కోమాలోకి వెళ్లిన సావిత్రి 1981 డిసెంబరు 26 న శాశ్వతంగా వెళ్లిపోయింది.



భావితరాలకి సావిత్రి పెద్ద నటనా నిఘంటువు. సినీ పెద్దలన్నట్టు ఆమెలా నటించడం కాదుకదా అనుకరించడం కూడా సాధ్యంకాదు. వృత్తిపై ఆమెకున్న నిబద్దత, సాటిమనిషి పట్ల సావిత్రి చూపిన మానవత ప్రతిఒక్కరికీ ఆదర్శనీయం అనుసరణీయం.