మెదడును తినేసే అమీబా - ఇది బుర్రలోకి చేరితే మరణమే, ఎలా సోకుతుంది? మెదడును తినేసే అమీబా.. వినేందుకే చాలా భయానకంగా ఉంది కదూ. ఇటీవల ఐదేళ్ల చిన్నారిని ఈ అమిబా పొట్టనబెట్టుకుంది. మొదట్లో ఆ చిన్నారికి ఏమైందో ఎవరికీ తెలియలేదు. వైద్య పరీక్షల్లో అసలు సంగతి తెలిసింది. ఆ చిన్నారి ఓ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. స్విమ్ చేస్తున్నప్పుడు.. ముక్కు ద్వారా అమీబా చేరిందని, అక్కడి నుంచి మెదడులోకి వెళ్లి ఉండవచ్చని తెలిపారు. వైద్య పరిభాషలో ఈ అమీబాను నెగ్లేరియా ఫౌలెరి (Naegleria fowleri) అని పిలుస్తారు. ఆ చిన్నారికి వచ్చిన ఈ అరుదైన సమస్యను ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అంటారు. ఇది ఒకరమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్. వెచ్చని నీరు, స్విమ్మింగ్ పూల్స్, స్ప్లాష్ ప్యాడ్‌లు, వాటర్ పార్కుల్లో ఇది ఉంటుంది. తక్కువ క్లోరినేషన్, అపరిశుభ్రంగా ఉండే స్విమ్మింగ్ పూల్స్, నదులు, సరస్సుల్లో ఇది ఎక్కువగా నివసిస్తుంది. ఇది సోకితే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి.