కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు



‘న కార్తీకే సమో మాసం..న కృతేన సమం యుగం..నవేద సద్రసం శాస్త్రమ్‌..న తీర్థ గంగాయ సమం’ అంటే కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన నది, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని అర్థం.



కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణం లో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి.



స్నానం
కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి



దీపం..
‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’.దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి.



అజ్ఞానం అనే అందకారాన్ని తొలగించి జ్ఞానాన్నిస్తుంది అనేందుకు దీపం చిహ్నమని చెబుతారు. నిత్యం దీపారాధన చేసే ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని చెబుతారు. అయితే ఏడాదంతా దీపారాధన చేయనివారు కనీసం కార్తీకమాసంలో అయినా దీపం వెలిగించాలి



సంధ్యాదీపం ప్రధానం
ముఖ్యంగా కార్తీకమాసంలో సంధ్యాదీపం ప్రధానం. సాయంత్రం పూట ఆలయంలో గానీ, తులసికోట, రావిచెట్టు వద్దగానీ, మేడపైన, ఏదైనా నదివద్ద దీపారాధన చేస్తే శివానుగ్రహం లభిస్తుందని కార్తీకపురాణంలో ఉంది.



ఉపవాసం
ఉపవాసం దేవుడికోసం కాదు మన ఆరోగ్యం కోసం చేయాలి. వారంలో ఓ రోజు ఉపవాసం ఉండడం జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మనసు నిర్మలంగా మారి దైవం వైపు మళ్లుతుంది. కేవలం ఆహారాన్ని మానేయడం కాదు.. కోరికలు పక్కనపెట్టి ధ్యాసను భగవంతుడిపై లగ్నం చేయడం



దానం..
సనాతన ధర్మంలో గృహస్థులు చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో స్నానం, దానం, జపం, తర్పణం. అన్ని నెలల్లో కన్నా కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జప, తర్పణాలకు అధిక పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.



అందుకే కార్తిక మాసంలో ఎవరైతే నవధాన్యాలు, అన్నం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, సువర్ణ దానం, గోదానం, కన్యాదానం చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని మార్కండేయ, శివ పురాణాలు చెబుతున్నాయి.



లైంగిక వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం ముట్టుకోరాదు
ఎప్పుడూ ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు..కనీసం ఓ నియమంలా పాటిస్తూ ఈ నెలరోజులైనా పాపపు ఆలోచనలు మానేయాలి



విశ్వాసం ఉంటే దేవుడిని పూజించండి లేదంటే మానేయండి... దైవదూషణ మాత్రం చేయకండి
(Image Credit: Pinterest)