వణికించే చలిలో కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి!



కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది...



బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీకస్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెలరోజులూ ఈ నియమం పెట్టారు.



కార్తీకమాసంలో తొందరగా నిద్రలేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవపూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు..మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది.



నదీ స్నానం చేయాలంటే నదివరకూ నడవాలి. అంటే తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామమే. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం.



నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా, ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీకమాసమే అనువైనసమయం.



చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీకమాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో ఔషధలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు.



శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను Electro Magnetic Activity” అంటారు.



ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం, దేవుడు,భక్తి పేరుచెప్పి కార్తీకం నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు.



ఈ నెలరోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే మరి.



(Images Credit: Google)