స్లో అండ్ స్టడీ గ్రోత్ కోసం ప్రస్తుతం మీరు తీసుకుంటున్న సమయమే మీకు తెలిసిన దానికంటే ఎంతో ముఖ్యమైనదని చెబుతోంది కృతి శెట్టి. పువ్వులు ఒక్కరోజులో వికసించవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తోంది ఈ బ్యూటీ. లండన్ వీధుల్లో సందడి చేస్తున్న అందాల భామ కృతి.. 'బటర్ ఫ్లై డేఅవుట్' అంటూ తాజాగా కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. 'నిన్ను నువ్వు ప్రేమించు' అంటూ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడే ఉప్పెనలా టాలీవుడ్ లో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మకు ఈ మధ్య కాలంలో ఏదీ కలిసిరావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమై, ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అందుకే ఇప్పటి నుంచి స్లో అండ్ స్టడీగా ముందుకు వెళ్లాలని భావిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'సూపర్ 30' అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన కృతి.. 'ఉప్పెన' చిత్రంతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మెగా మేనల్లుడితో కలిసి చేసిన ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలు హిట్ అవ్వడంతో అమ్మడి డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే 'మాచర్ల నియోజకవర్గం', 'ది వారియర్', 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి', 'కస్టడీ' చిత్రాలు ఆసించిన విజయాలు అందుకోలేదు. అయితే తమిళ మలయాళ భాషలపై ఫోకస్ పెట్టిన కృతి.. ప్రస్తుతం 'అజయంతే రందం మోషణం' 'జెనీ' సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.