2023 నవంబరు 27 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ
కార్తీకమాసంలో పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది.
పూర్వం వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించినది ఈ పౌర్ణమినాడే.
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనరోజు కార్తీకపౌర్ణమి. శివుడు త్రిపురాసురులను సంహరించింది కూడా ఈ పౌర్ణమిరోజే
ఈ పౌర్ణమినాడు కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. ఒక కోడెదూడను ఆబోతుగా స్వేచ్చగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రీత్యర్థం వదులుతారు.
ఇలా చేయడంవల్ల గయలోవారి ఆత్మశాంతి కోసం కోటిసార్లు శ్రాద్ధకర్మలు జరిపిన పుణ్యఫలం లభిస్తుంది.
తమిళనాడు తిరువణ్ణామలైలో జ్యోతిస్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి ఈరోజున వేలాదిమంది అక్కడికి తరలివెళ్తారు.
కార్తీక పౌర్ణమిరోజు రాత్రి పండు వెన్నెల ఉంటుంది. ఈ వెన్నెలలో పాలుకాస్తే ఆ పాలు అమృతతుల్యం అవుతాయని ఒక నమ్మకం. ఆ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారట.
కార్తీక పౌర్ణమిరోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతోపాటు అతిచేరువలోనే బృహస్పతి (గురుగ్రహం) కూడా ఉంటుంది. ఆ గురుశిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.