అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడపురాణాన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు తన సారథి అయిన గరుత్మంతునికి ఉపదేశించగా, వేదవ్యాసుడు రచించారు. ఆయన గ్రంథస్థం చేసినది చదవడానికే కదా..అయినప్పటికీ చాలామందిలో ఇది చదవాలా, వద్దా - ఇంట్లో ఉండాలా వద్దా అనే సందేహం ఉండిపోయింది.
ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి ఆచారకాండ ( కర్మకాండ) ప్రేతకాండ ( ధర్మకాండ) బ్రహ్మకాండ( మోక్షకాండ)
మొదటికాండను పూర్వఖండమనీ చివరి రెండు కాండలనూ కలపి ఉత్తర ఖండమనీ వ్యవహరిస్తారు. ఈ కాండలు దేనికవే విభిన్నంగా ఉంటాయి. ఆచార కాండ-240 అధ్యాయాలు ప్రేతకాండ -50 అధ్యాయాలు బ్రహ్మకాండ- 30 అధ్యాయాలు
ఇహలోకంలో ధర్మంగా ఉండి పరలోకంలో పరమాగతి పొందమని చెబుతోంది గరుడ పురాణం. లేదంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని బోధిస్తోంది.
గరుడపురాణం రేపో మాపో పోయేవారి కోసం కాదు.. అందరూ చదవాల్సిన గ్రంథం. ఇది చదివితే తప్పకుండా పాపభీతి కలుగుతుంది. పైగా గరుడపురాణం చదివితే పితృదేవతలు కూడా అదృశ్యరూపంలో వచ్చి వింటారట.
ఈ పురాణంలో యముడు ప్రధాన దేవత. మన పాపపుణ్యాల వివరాలన్నిటినీ చిత్రగుప్తుని ద్వారా తెలిసుకుని తగిన శిక్షలు విధిస్తాడు. కేవలం భౌతికంగా చేసిన పాపాలు మాత్రమే కాదు, మానసికంగా చేసిన పాపాలు కూడా ఇందులో కౌంట్ అవుతాయి.
శిక్షలన్నీ అనుభవించిన తర్వాత స్వచ్ఛమైన ప్రకాశంతో ఆత్మ పరమాత్మలో లీనం కావడమో మరుజన్మ లభించడమో జరుగుతుంది.
గరుడ పురాణంలో ధర్మం, మరణ సమయ ప్రస్తావన, యమదూతల వర్ణన, నరక ప్రయాణం, యాతన దేహధారణ, వైతరణి వర్ణన, నరక బాధలు, దారిలో వచ్చే మృత్యుపట్టణాలు, నరకాలూ, కర్మరాహిత్య ఫలితాలూ, దానాల వివరణ, కర్మ విధానాలూ, దైవ, వేదాంత, స్మరణ, భక్తి విధానాలూ ఉంటాయి.
మనిషిగా పుట్టడం ఓ వరం. ఈ వరాన్ని శాపంగా మార్చుకోవద్దని చెబుతుంది గరుడపురాణం. అయితే అసలు విషయాన్ని వదిలేసి గరుడ పురాణం ఇంట్లో ఏదో జరిగిపోతుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దంటున్నారు పండితులు.
అన్ని పురాణ గ్రంధాలు ఇంట్లో పెట్టుకున్నట్టే గరుడపురాణం కూడా నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు, నిత్యం చదువుకోవచ్చు.