ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్‌లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనను సీఎం పినరయి విజయన్ స్వాగతించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు మోదీ. అక్కడ ఎంత నష్టం జరిగిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు నష్టం ఎక్కువగా నమోదైన ప్రాంతాలను మోదీ సందర్శించారు. బాధితులందరినీ ఎక్కడికి తరలించారో ఆరా తీశారు. కేరళ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలోనే మోదీ ఇక్కడ పర్యటించారు. ఆర్మీ తాత్కాలికంగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్‌ని మోదీ పరిశీలించారు. సహాయక చర్యలు ఎలా చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ రిలీఫ్ క్యాంప్‌లలోని బాధితులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటించారు మోదీ. ఆరోగ్యం ఎలా ఉందని పలకరించి కాసేపు వాళ్లతో నవ్వుతూ మాట్లాడారు. వయనాడ్ బాధితులను చూస్తే గుండె బరువెక్కిపోయిందని అన్నారు ప్రధాని. పునరావాస చర్యలపై దృష్టి సారించాలని సూచించారు.