పాకిస్థాన్‌తో టీ20 మ్యాచులో భారత అమ్మాయిలు తిరుగులేని విజయం సాధించారు. ప్రత్యర్థి నిర్దేశించిన 100 టార్గెట్‌ను మంచినీళ్లు తాగినంత ఈజీగా ఛేదించేశారు. కేవలం 12 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించారు. ఓపెనర్ స్మృతి మంధాన (63*; 42 బంతుల్లో 8x4, 3x6) ఆకలిగొన్న పులిలా విరుచుకుపడింది. అంతకు ముందు పాక్‌లో మునీబా అలీ (32; 30 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్. వర్షం వల్ల మ్యాచును 18 ఓవర్లకు కుదించారు. షెఫాలీ వర్మ (16; 9 బంతుల్లో 2x4, 1x6), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (14; 16 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించారు. స్నేహ్ రాణా (2/15), రాధా యాదవ్ (2/18) చెలరేగడంతో పాక్ 99కి పరిమితమైంది. బౌలింగులో రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెపాలీ వర్మ తలో వికెట్ తీశారు. కామన్వెల్త్ క్రీడల్లో టీమ్ఇండియాకు ఇదే తొలి విజయం.