జూలై 17 నుంచి దక్షిణాయణం ప్రారంభమవుతోంది. ఉత్తరాయణంలో దైవకార్యాలు నిర్వహిస్తే దక్షిణాయంలో పితృకార్యాలు నిర్వహించాలని, తర్పణాలు విడవాలని చెబుతారు.
ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం.
ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. అందుకే ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం, అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ప్రత్యేక ఉపవాసాలు, పూజలు చేస్తారు.
దక్షిణాయనం ఉపవాసకాలం అంటారు. ఈ సమయంలోనే యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షచేపడతారు.
ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు శ్రీ మహావిష్ణువు.
శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది, ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు.
వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
దక్షిణాయనంలోనే పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు.
ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహలయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది.