ఆహారాన్ని వేగంగా తింటే బరువు పెరిగిపోతారు కొంతమంది భోజనాన్ని ఐదు నిమిషాల్లోనే ముగిస్తారు. మరి కొంతమంది అరగంట పాటు తింటారు. ఎవరైతే కాస్త నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ నమిలి మింగుతూ ఉంటారో, వారి ఆరోగ్యమే చక్కగా ఉంటుంది. ఆహారాన్ని వేగంగా తినడం వల్ల నోట్లో ఎక్కువసేపు నమలరు. కేవలం ఒకటి రెండుసార్లు నమిలి మింగేస్తారు. ఇదే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే వేగంగా తినే వ్యక్తి మానసిక, భావోద్వేగ, శారీరక శ్రేయస్సు పై అనేక సమస్యలు పడే అవకాశం ఉంది. ఆహారాన్ని సరిగా నమలకుండా మింగినప్పుడు అది జీర్ణాశయంలో విచ్ఛిన్నం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. మనం తిన్న ఆహారం మనకు సరిపోయిందో లేదో పొట్ట నిండిన అనుభూతి రావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. కేవలం 5 నిమిషాల్లోనో, పదినిమిషాల్లోనూ ఆహారాన్ని ముగించడం వల్ల పొట్ట నిండిన అనుభూతిని మెదడు గుర్తించలేదు. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల ఆహారం మన శరీరానికి సరిపోతుందో లేదో మెదడు అంచనా వేస్తుంది.