ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దూసుకెళ్తోంది! టీమ్ఇండియా వరుసగా రెండో విజయం అందుకుంది. సిడ్నీ వేదికగా సాగిన పోరులో నెదర్లాండ్స్‌ను 56 పరుగుల తేడాతో చిత్తుచేసింది. 180 టార్గెట్ ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 123/9కే పరిమితం చేసింది. టిమ్ ప్రింగిల్ (20; 15 బంతుల్లో 1x4, 1x6) టాప్ స్కోరర్. రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. టీమ్‌ఇండియాలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (51*; 25 బంతుల్లో 7x4, 1x6) మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 39 బంతుల్లో 4x4, 3x6), విరాట్ కోహ్లీ (62*; 44 బంతుల్లో 3x4, 2x6) హాఫ్ సెంచరీలతో రాణించారు. గ్రూప్ 2లో 4 పాయింట్లతో టీమ్‌ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది. భువనేశ్వర్ కుమార్ కళ్లుచెదిరే బౌలింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ మరోసారి విఫలమవ్వడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి.