ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) 130 కోట్ల మందిని మురిపించాడు. అఖండ భారతావనికి ఒక్కరోజు ముందుగానే దీపావళి తీసుకొచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 తొలి సూపర్ 12 మ్యాచులో టీమ్‌ఇండియాను గెలిపించాడు. కోహ్లీకి తోడుగా హార్దిక్ పాండ్య (40; 37 బంతుల్లో 1x4, 2x6) చెలరేగిన వేళ టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. యూఏఈలో టీ20 ప్రపంచకప్, ఆసియాకప్ ఓటములకు ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. దాయాది పాకిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను సమయోచితంగా ఛేదించింది. ఒక్కో ఇటుక పేర్చినట్టు.. లెక్కపెట్టుకొని మరీ స్కోరు చేసింది. 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. బాబర్ సేనలో ఇఫ్తికార్ అహ్మద్ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్ మసూద్ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలు బాదేశారు. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ (3/32), హార్దిక్ పాండ్య (3/30) రాణించారు. టీమ్ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.