ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో టీమ్‌ఇండియా కథ ముగిసింది! అడిలైడ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఓటమి చవిచూసింది. 169 పరుగులను డిఫెండ్ చేసుకోలేక తెల్లముఖం వేసింది. కనీసం ఒక్క వికెట్టైనా పడగొట్టలేక అవమానం మూటగట్టుకుంది. ఈ టార్గెట్‌ను ఇంగ్లాండ్ ఈజీగా ఛేదించింది. 16 ఓవర్లకే 10 వికెట్లతో ఘన విజయం అందుకుంది. ఓపెనర్లు జోస్ బట్లర్ (80; 49 బంతుల్లో 9x4, 3x6), అలెక్స్ హేల్స్ (86; 47 బంతుల్లో 4x4, 7x6) టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేశారు. అంతకు ముందు విరాట్ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్ పాండ్య (63; 33 బంతుల్లో 4x4, 5x6) రాణించారు. ఆంగ్లేయులను అడ్డుకోవడంలో బౌలర్లు విఫలమయ్యారు. పిచ్ కండిషన్‌ను అర్థం చేసుకోకుండా వేగంగా బంతులు విసిరారు. 10.1 ఓవర్లకే ఇంగ్లాండ్ స్కోరు 100 దాటేసింది. 83 బంతుల్లోనే 150కి చేరుకుంది. 16 ఓవర్లకే గెలిచేసింది. భారీ సిక్సర్లు, బౌండరీలు బాదేస్తూ హేల్స్ 28, బట్లర్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. ఆదివారం మెల్ బోర్న్ లో ఇంగ్లాండ్, పాక్ ఫైనల్ ఆడనున్నాయి.