వేసవిని తట్టుకునేందుకు చిట్కాలు ఇవిగో... తీవ్రమైన వేడి గాలులు, ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని కచ్చితంగా పాటించి ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవాలని సూచిస్తోంది. దాహం వేయకపోయినా నీళ్లు తాగుతూనే ఉండాలి. వేసవిలో దాహం వేసిందంటే డీహైడ్రేషన్ సమస్య మొదలయ్యే అవకాశం ఉందని అర్థం. బయటికి వెళ్లేటప్పుడు కచ్చితంగా నీళ్ల బాటిల్ తీసుకుని వెళ్లాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు పండ్ల రసాలు, నిమ్మరసాలు, మజ్జిగ, వంటివి కాస్త ఉప్పు కలుపుకుని తాగుతూ ఉండాలి. వేసవిలో అందుబాటులో ఉండే పండ్లను తింటూ ఉండాలి. ముఖ్యంగా పైనాపిల్, కీరాదోస, ఆరెంజ్, ద్రాక్షలు, మస్క్ మెలన్, పుచ్చకాయ వంటివి తింటూ ఉండాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. వీలైనంత వరకు ఎర్రటి ఎండల్లో బయటకు వెళ్లకుండా ఉండడమే ఉత్తమం. ఉదయం పూట వేడి గాలులు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు వేసే ఉంచాలి.