బ్లాక్ టీతో గుండెకు చేటు పరగడుపున తాగే పానీయాల్లో బ్లాక్ టీ కూడా ఒకటి. దీన్ని వినియోగిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. కామెల్లియా సినేన్సిస్ అనే మొక్క ఆకులతో ఈ బ్లాక్ టీని తయారు చేస్తారు. రుచి కోసం ఇతర మొక్కల సమ్మేళనాలను కూడా కలుపుతారు. రోజుకి ఒక బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ అధికంగా తాగితే మాత్రం అనారోగ్యాలు తప్పవు. బ్లాక్ టీ అధికంగా తాగితే అందులో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి చేటు చేస్తుంది. తేలికపాటి నుంచి తీవ్రస్థాయి వరకు తలనొప్పిని కలిగిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. గుండె కొట్టుకునే వేగాన్ని అసాధారణంగా మార్చుతుంది. బ్లాక్ టీ టానిన్లతో నిండుగా ఉంటుంది. శరీరంలో ఈ టానిన్లు అధికంగా చేరితే ఇనుము శోషణను అడ్డుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఇనుము లోపం ఏర్పడి రక్తహీనతకు కారణం అవుతుంది. రక్తహీనత వల్ల అనేక మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ టీ వల్ల పొట్టలో తిమ్మిరి, గ్యాస్ ట్రబుల్స్, వికారం, వాంతులు వంటి ఇతర జీర్ణాశయాంతర రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.