అరటి ఏడాదంతా దొరికే రుచికరమైన పండు. ఇష్టపడని వారు దాదాపుగా ఎవరూ ఉండరు. ఫైబర్, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లతో పౌష్టికాహారం అరటి. బరువుపెరుగుతామని, డయాబెటిస్ ఎక్కువ అవుతుందని కొందరు దీన్ని దూరంగా ఉంచుతారు. మరి కొందరు శీతాకాలంలో తింటే జలుబు, దగ్గు ఎక్కువవుతాయని అంటుంటారు. నిజానిజాలు తెలుసుకుందాం. ఆయుర్వేదంలో అరటి చలువ చేసే పండు. చల్లని వాతావరణంలో తరచుగా తీసుకుంటే ఫ్లూ, దగ్గు, జ్వరానికి కారణం కావచ్చట. అయితే చలువ చేసే ఇతర ఆహారాలు కూడా ఎక్కువగా తీసుకున్నపుడు మాత్రమే సమస్యలు వస్తాయట. అరటి పండులో బాన్లెక్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది వైరస్ లను ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుందట. ఈ కొత్త ఆవిష్కరణ ఇన్ఫెక్షన్ల నివారణకు దోహదం చేస్తుందని మిచిగాన్ విశ్వవిద్యాలయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ క్యాలరీలు ఉంటాయి కనుక రాత్రి పూట అరటి పండు తినకపోవడమే మంచిది. జీర్ణ సమస్యలు రాకుండా నివారించవచ్చు. మితంగా తీసుకున్నపుడు ఏ ఆహారం కూడా శరీరానికి హాని చెయ్యదని గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. Images courtesy : Pexels