మన దేశంలో అతి పురాతన, అత్యంత ప్రాచీనమైన ఏడు క్షేత్రాలున్నాయి. వీటిని ఏడు మోక్షదాయక క్షేత్రాలని పిలుస్తారు. వీటిని జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్నా సకల పాపాలు నశించి, సర్వలోకానికి వెళతారట. ఆ మోక్ష నగరాలేంటంటే.
అయోధ్య మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మ భూమి అని ప్రసిద్ధి. రామాయణ కాలం కన్నా ముందే సాకేత పురం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొన్నారు.
ద్వారక విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన శ్రీ కృష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్లు నివశించిన ప్రాంతం ద్వారక అంటారు. సంస్కతంలో ద్వార అంటే ప్రవేశం అని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందువల్లే పురాణ కాలం నుంచి ద్వారకా... మోక్షానికి ప్రవేశ ద్వారమని అంటారు.
మధుర ఉత్తర ప్రదేశ్ లో ఉన్న మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకూ మధుర ఓ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని ల్యాండ్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అని పిలుస్తారు.
ఉజ్జయిని క్షిప్రా నదీ తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం అటు వైష్ణవులకు, ఇటు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన నగరంగా పేరొందింది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. మహాకాళేశ్వర దేవాలయం దేశంలో ఉన్న పరమ పవిత్రమైన శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.
హరిద్వార్ గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయానగరమని పిలుస్తారు. గరుడుడు అమృతాన్ని తీసుకెళుతుండగా ఇక్కడ ఓ చుక్క పడిపోయిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యం అంటారు. కుంభమేళ జరిగే సమయంలో లక్షల మంది హరిద్వార్ ను చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తారు.
వారణాసి ఇక్కడ శివుడు నివసిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి హిందూ ధార్మిక పర్యటనలో విశిష్ట స్థానం కల్పించారు. గంగానది తీరంలో వెలిసిన వారణాసిలో అడుగుకో దేవాలయం ఉంటుంది. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇదొకటి.
కాంచిపురం సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాంచిపురం. ఇక్కడ దేవాలయాల్లో ప్రమఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ శివుడు కూడా కొలువై ఉండడంతో శైవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది.