డీహైడ్రేషన్ వల్ల పెద్దపేగుకు నష్టం వేసవి వచ్చిందంటే శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. దీని వలన శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. సమయానికి నీరు తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల మూర్చలు, మూత్రపిండాల వైఫల్యం, కోమా వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. డీహైడ్రేషన్ వల్ల పెద్ద పేగుపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పెద్ద పేగు అనేది జీర్ణవ్యవస్థలోని చివరి విభాగం. పేగులు ప్రతిరోజు ఒక లీటరు కంటే ఎక్కువ ద్రవాన్ని గ్రహిస్తాయి. పేగులోని వ్యర్థాలను ఆ ద్రవం సాయంతో బయటికి పంపేందుకు ప్రయత్నిస్తాయి. ఆ వ్యర్థాలే మలం. పెద్దపేగుకు తగినంత నీరు అందకపోతే మలం గట్టిపడుతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల పేగులలో తీవ్ర సమస్యలు రావచ్చు. నీటి కొరత కారణంగా పేగుల పనితీరు నెమ్మదిగా మారడమే కాదు కొన్నిసార్లు ఆగిపోతుంది కూడా. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతిరోజు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.