తల్లి పాలతో పిల్లలకు క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది ఎక్కువ కాలం పాటు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికీ, బిడ్డకీ ఇద్దరికీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లీ, పిల్లలూ ఇద్దరూ కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. ఈ విషయాన్ని కొన్ని అధ్యయనాలు ఇప్పటికే నిరూపించాయి. తల్లిపాలలో యాంటీ బాడీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తల్లిపాలను పుట్టినప్పటినుంచి ఎక్కువ కాలం పాటు తాగితే లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లల్లో న్యూరోబ్లాస్టోమా అనే సమస్య వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిపాలు ఎక్కువ కాలం ఇవ్వడం వల్ల తల్లి త్వరగా బరువు తగ్గుతుంది. ఆమెలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ.