భోగి మంటల ద్వారా అగ్నిని ఆరాధించండి అపవిత్రం చేయకండి



భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా వెలిగించాలి.



సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తే భోగి మంట వెలిగించాలి...అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది .



ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగిమంటలో వాడేవారు. ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి వేసేవారు.



పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. పిడకలు, చెట్టు బెరడు ఉపయోగించలేని వారు కనీసం తాటి, కొబ్బరి ఆకులు , ఎండిన కొమ్మలతో భోగిమంట వేసేవారు.



కానీ కాలం మారింది భోగిమంట కూడా ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంట్లో ఉన్న చెత్తా చెదారం, రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా భోగిమంటల్లో వేస్తున్నారు.



ప్లాస్టిక్ సామాన్లు మంటల్లో వేయడమే సరికాదంటే..అవి సరిగా మండడం లేదని పెట్రోల్, కిరోసిన్ పోస్తునారు... దీంతో భోగిమంటల వెచ్చదనం, సంక్రాంతి సందడి మాటేమో కానీ అనారోగ్యం రావడం ఖాయం.



రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరోసిన్ నుంచి వెలువడే పొగతో పర్యావరణం కలుషితమవుతోంది.



పిడకలు, చెట్టు బెరడు, కలప లాంటివి వేసుకుని భోగిమంట వేయకపోయినా పర్వాలేదు కానీ... ప్లాస్టిక్, చెత్తా-చెదారంతో భోగిమంట వేసి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పాడుచేయొద్దంటున్నారు పండితులు, ఆరోగ్య -పర్యావరణ నిపుణులు.



2023 జనవరి 14 వ తేదీన భోగిపండుగ. ఈ రోజు తెల్లవారుజామునే చలిగాలుల మధ్య వెచ్చని భోగిమంట వేసుకుని సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం పలుకుతారు..



Images Credit: Pinterest