Dussera Festival Special Offer In Mancherial: బంపర్ ఆఫర్.. మొదటి బహుమతి గొర్రె పొట్టేలు, రెండో బహుమతి మేక, మూడో బహుమతి నాటు కోడి, ఫుల్ బాటిళ్లు. ఇదేంటి బహుమతులంటే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటాయి కదా అనుకుంటున్నారా.?. కానీ ఇది నిజం. రాబోయేది దసరా సీజన్ కదా.. అందుకే అక్కడి యువత వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో లక్కీ డ్రా పెట్టి మరీ వాటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకూ ఎక్కడో తెలియాలంటే పూర్తిగా చదివేయండి మరి..
మంచిర్యాల జిల్లాలోని (Mancherial) బోయపల్లి గ్రామస్థులు ఈసారి దసరా పండుగను వినూత్నంగా జరిపించాలని నిర్ణయించారు. రూ.100కు ఓ కూపన్ తీసుకుంటే లక్కీ డ్రాలో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన డ్రా తీస్తారు. అందులో గెలిచిన వారికి వినూత్న బహుమతులు అందించనున్నారు. ఇంతకీ ఆ లక్కీ డ్రాలో ఉన్న బహుమతులు ఏంటో తెలుసా..
ఫస్ట్ ప్రైజ్ గొర్రె పొట్టేలు
గ్రామంలోని యువత వినూత్నంగా ఆలోచించి ఫస్ట్ ప్రైజ్‌గా గొర్రె పొట్టేలు, రెండో బహుమతిగా మేక, మూడో బహుమతిగా జానీవాకర్ ఫుల్ బాటిల్, నాలుగో బహుమతి టీచర్స్ ఫుల్ బాటిల్, ఐదో బహుమతి బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్, ఆరో బహుమతి 100 పైపర్స్ ఫుల్ బాటిల్, ఏడు, ఎనిమిదో బహుమతి నాటుకోడి పుంజు, తొమ్మిది, పదో బహుమతులుగా నాటుకోడి పెట్టలను ప్రకటించారు. దీంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున డ్రాలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2 రోజుల్లోనే దాదాపు 50 శాతం కూపన్స్ అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు మాసాడి శశివర్థన్ మాసాడి విజయ్ కుమార్ తెలిపారు. వినూత్న రీతిలో దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని వారికి వచ్చిన ఆలోచనను ఇలా లక్కీ డ్రా స్కీమ్‌తో ఉత్సాహంగా మార్చారు. కూపన్స్ తీసుకున్న జనం అక్టోబర్ 10వ తేదీన లక్కీ డ్రాలో బహుమతులు తీసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.