Man Killed In Nizamabad District: తెలంగాణలో (Telangana) దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి తన కుమార్తె ఆత్మహత్యకు అత్తింటి వారే కారణమని భావించాడు. వారి ఇంటిపై దాడికి పాల్పడి వియ్యంకుడిని నరికేశాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం కంజర గ్రామంలో గోవర్థన్ అనే యువకుడు భవిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఆమె ఆత్మహత్యకు పాల్పడగా.. భవిత మృతికి గోవర్థనే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో మృతురాలి తండ్రి సత్యనారాయణ అత్తింటి వారిపై దాడి చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గోవర్థన్ ఇంట్లో లేకపోవడంతో అతని తండ్రి నరహరిని కత్తులతో నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు మహిళల అరెస్ట్
మరోవైపు, ఇదే నిజామాబాద్‌లో పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని సరస్వతి నగర్ నీలోఫర్ ఆసుపత్రి నాలుగో అంతస్తులో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ప్రముఖ వైద్యుల సతీమణులని తెలుస్తోంది.
లాడ్జిలో యువకుని ఆత్మహత్య
సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలోని లాడ్జిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ భూపాలపల్లికి చెందిన అక్షయ్ కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే కొత్త బైక్ కొనుగోలు చేసి సొంతూరుకి వెళ్లి వచ్చిన అక్షయ్.. బుధవారం బండి మెట్‌లోని లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. అనంతరం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. తనకు ఇష్టమైన వారి ఫోటోలను స్టేటస్‌గా పెట్టుకోవడంతో.. వాటిని చూసి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. సెల్ సిగ్నల్స్ ఆధారంగా లాడ్జిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులతో వెళ్లి చూడగా అక్షయ్ విగతజీవిగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Tirupati Laddu Row:బయటకి రావద్దని జగన్‌కి రాజాసింగ్ సలహా- తిరుమలేశుడికి లేఖ రాసిన మాధవీ లత