RSS On Nadda Comments: కేంద్ర హెల్త్ మినిష్టర్ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చ అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు. ఇదో కుటుంబ విషయంగా పేర్కొన్నారు. కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలుగానే చూస్తామని అన్నారు. వీటిని తామే పరిష్కరించుకుంటామని చెప్పారు.


అసలు జేపీ నడ్డా ఏమన్నారు?


2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ న్యూస్‌ ఛానెల్‌కు జేపీనడ్డా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బీజేపీ ఎదుగుదలలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రపై స్పందించారు. తొలి రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌పై బీజేపీ ఆధారపడిందన్నారు. ఆ తర్వాత తమకు తాముగా ఎదిగామని అన్నారు. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆధారపడని స్థాయికి బీజేపీ చేరిందన్నారు. తన రాజకీయాలు తాను చేసుకోల స్థితికి చేరుకుందన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవగా.. ఆర్‌ఎస్‌ఎస్ మే నుంచి ఇప్పటి వరకూ ఎక్కడా స్పందించ లేదు. నడ్డా వ్యాఖ్యలపై సునీల్ అంబేకర్‌కు ముంబై ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశంలో ప్రశ్న ఎదురవగా ఆయన  స్పందించారు. కుటుంబ సమస్యలపై ఆర్ఎస్‌ఎస్‌ ఎప్పుడూ బహిరంగ చర్చ పెట్టదని అంబేకర్ అన్నారు. కుటుంబ సమస్యలను కుటుంబంలోనే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.


బలవంతపు మతమార్పిళ్లు ఏ సమాజంలో అయినా తప్పే:


దేశంలో చోటుచేసుకుంటున్న బలవంతపు మతమార్పిళ్లుపై సునీల్ అంబేకర్ స్పందించారు. ఏ సమాజంలో అయినా ఈ తరహా విధానం సరైంది కాదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఇలాంటి చర్యలను సహించదని చెప్పారు. ఈ విషయంలో సమాజానికి తోడుగా లీగల్‌ అంశాల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మత మార్పిళ్లు అంశానికి కొంత మంది రాజకీయ రంగు పులమడం సరైన చర్య కాదన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాక ఎవరైనా మంచి చేయాల్సిందే:


 రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనుకునే వారికి ఆర్‌ఎస్‌ఎస్ ఒక లాంచింగ్ ప్యాడ్‌గా ఉందన్న వ్యాఖ్యలపైనా సునీల్ స్పందించారు. ఎవరైతే సమాజానికి మంచి చేయాలని అనుకుంటారో వారు మాత్రమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో భాగం అవుతారని చెప్పారు. సంఘ్ ట్రైనింగ్ చాలా క్లిష్టంగా ఉంటుదన్నారు. ప్రతి రోజూ శాఖకు వెళ్లాలి, చాలా ఫిజికల్ ఎక్సర్‌సైజెస్‌తో పాటు డిసిప్లైన్‌ అలవడేలా అనేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. తమ దగ్గరకు రోజూ చాలా మంది మంచి చేయాలన్న తపనతో వస్తుంటారని అంబేకర్ తెలిపారు. ఐటీ సెక్టార్‌ నుంచి ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో చాలా మంది వస్తున్నారని అన్నారు. ఒక వేళ ఎవరైనా పొలిటికల్ ఐడియాలతో వచ్చినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్ వారిని మంచి పనులు చేసే దిశగానే నడిపిస్తుందని వివరణ ఇచ్చారు.


గడచిన పదేళ్ల ఎన్‌డీఏ పాలనలో దేశానికి ప్రపంచవ్యాప్తంగా సరైన గుర్తింపు లభించిందని సునీల్ అంబేకర్ అన్నారు. ఇండియా శక్తిని ప్రపంచ దేశాలు గ్రహించాయన్నారు. సైన్స్ రంగంలోనూ ఆర్థిక రంగంలోనూ, టెక్‌ రంగంలోనూ భారత ప్రగతి కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న కులగణనపై స్పందించిన ఆయన.. ఇదో పొలిటికల్ టూల్‌లా మారకుండా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఫలాలు అందేలా ఉండాలని చెప్పారు. మణిపూర్ హింస దేశం మొత్తాన్ని ఆందోళనకు గురి చేస్తోందన్నారు. అక్కడ ఆర్‌ఎస్‌ఎస్ సహాయచర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతానికి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆడ మగ కలిసి పనిచేసిన దాఖలాలు లేవన్నారు. ఒకవేళ ఈ డిమాండ్ తెరమీదకు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని సునీల్‌ చెప్పారు.


Also Read: సీనియర్ సిటిజన్స్‌కు ఇండియన్ రైల్వే కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలు మీకు తెలుసా! 45 ఏళ్ల నుంచే మహిళలకు