Viral News: కొన్ని గ్రామాల్లో బతుకుదెరువు కోసం ఎదిగొచ్చిన పిల్లలు ఇతర ప్రాంతాలకు వలస పోతారు. పెద్దోళ్లు మాత్రం పుట్టి పెరిగిన ఊరు వదల్లేక ఆ ఊర్లోనే ఉంటారు. డబ్బులైతే పిల్లలు పంపుతారు కానీ.. వాళ్లు తిన్నారో లేదో ఎవరు చూస్తారు? జబ్బున పడితే ఎవరు వండి పెడతారు. ఈ సమస్యనే ఎదుర్కొన్న ఆ గ్రామం నేడు.. కమ్యూనిటీ డైనింగ్ ఐడియాతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ ఐంది.


న్యూయార్క్ నుంచి వచ్చాడు.. ఊర్లో పండుటాకులకు అన్నం పెట్టే చెయ్యి  


            గుజరాత్‌ మెహసానా జిల్లాలోని బెచార్‌జీ తాలూకా పరిధి చందంకి గ్రామం నేడు విశ్వ వ్యాప్తంగా ఫేమస్ ఐంది. ఆ ఊరి ప్రజలు చాటుతున్న వసుధైక స్ఫూర్తిని మెచ్చుకుంటూ ఆ గ్రామాన్ని చూసేందుకు బయట నుంచి కూడా చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. దీనికి కారణం ఆ ఊరికే ప్రత్యేకమైన కమ్యూనిటీ డైనింగ్‌. ఇది ఆ ఊరిలో ముసలి వాళ్ల ఆకలి తీర్చడానికి తీసుకొచ్చిన కార్యక్రమం. ఈ విధానమే ఆ ఊరిని భారత్‌లోని లక్షలాది గ్రామాల కంటే భిన్నంగా ఉంచి నలుగురూ మాట్లాడుకునేలా చేసింది.






  కమ్యూనిటీ డైనింగ్ ఐడియా       


ఈ కమ్యూనిటీ డైనింగ్ ఐడియా ఆ గ్రామ సర్పంచ్‌ పూనమ్ భాయ్ పటేల్ 20 ఏళ్ల పాటు న్యూయార్క్‌లో ఉండి తిరిగి వచ్చారు. ఆయన వచ్చే సరికి ఊరిలో ముసలి వాళ్లు తప్ప యువత పెద్దగా ఎక్కడా కనిపించ లేదు. బతుకుదెరువు కోసం బయటకెళ్లిన పిల్లలు ముసలి వాళ్లకు డబ్బులు పంపుతున్నారని కానీ వాళ్లు ఆ డబ్బులతో వంట సరుకు తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి లేదని గమనించారు. అనుకున్నదే తడవుగా కమ్యూనిటీ డైనింగ్ ఐడియాను ప్రవేశ పెట్టారు. గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 250 మంది జనాభా కాగా అందులో 117 మంది పురుషులు, 117 మంది స్త్రీలు. వీళ్లందరూ వయస్సు మళ్లినవాళ్లు. ఇప్పటి లెక్కల ప్రకారం ఆ గ్రామం జనాభా వెయ్యి వరకూ ఉండగా 500 మంది వృద్ధులు గ్రామంలో ఉంటున్నారు. వీళ్లు అందరూ నెలకు ఒక్కొక్కరు 2 వేల రూపాయల వరకు ఇస్తారు. ఆ డబ్బులతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రోజూ రెండు పూటలా రుచి శుచితో కూడిన ఆహారాన్నివాళ్లకు అందిస్తారు. ఊర్లో వాళ్లు అందరూ రెండు పూటలా ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారిలో ఒంటరితనం కూడా పోయి ఆనందంగా గడుపుతున్నట్లు సర్పంచ్ పూనమ్‌ భాయ్ పటేల్ తెలిపారు.


ఎవరూ ఇంట్లో వంటలు చేయడం లేదు 
ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చందంకి గ్రామంలో ఎవరూ ఇంట్లో వంటలు చేయడం లేదు. అందరూ కమ్యూనిటీ డైనింగ్‌కే వచ్చి గుజరాత్ వంటకాలు తినడానికి అలవాటు పడ్డారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు భోజనం చేసే సమయంలో మాత్రం ఒకే కుటుంబంగా మారిపోతారు. ఈ విధానం చందంకి గ్రామాన్ని సోషల్ మీడియాలో ఫేమస్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొందరు వచ్చి ఈ కమ్యూనిటీ డైనింగ్‌లో ఆ గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేసి వసుధైక స్ఫూర్తిని పొందుతుంటారు.


Also Read: Tirupati Laddu Row: తిరుమల లడ్డు కల్తీ ఉద్దేశ్యపూర్వక నేరమే! సంచలన వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్ సరస్వతి