ఇప్పుడు ప్రతీ ఇంటిపై నీటి అవసరాల కోసం ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది.. అయితే మనం ఏదో పనిలోపడి మోటారు స్విచ్‌ ఆఫ్‌ చేయడం మర్చిపోతుంటాం.. ఇంతలోనే ట్యాంకు నిండిపోయి వోవర్‌ ఫ్లో అయ్యి చాలా మంచినీరు వృధా అవుతుండడం కూడా కనిపిస్తుంటుంది.. అంతేకాదు హడావిడిగా బయటకు వెళ్దామని బాత్‌రూమ్‌లోకి వెళ్లి స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ట్యాంకులో నీరు ఖాళీ అయిపోయిన సందర్భమూ చాలా మందికి ఎదురై ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొన్నానని అంటున్నారు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురంకు చెందిన జానా భగవాన్‌ అనే వ్యక్తి.


ఆయన సొంత అనుభవంలోనుంచి పుట్టిన ఆలోచనకు ఓ పరికరం రూపుదిద్దుకుంది. ఎటువంటి ఎలక్ట్రానిక్‌ డివైస్‌ లేకుండా కేవలం మెకానికల్‌గా పీవీసీ పైపులు, ఒక 20 యామ్ప్స్‌ స్విచ్‌, ఒక బాల్‌ వంటి గుండ్రని ప్లాస్టిక్‌ వస్తువు.. ఇలా కలగలిపి ఓ వాటర్‌ రోబోట్‌ మిషన్‌ను తయారు చేశారు. ఇది సమర్ధవంతంగా పనిచేయడంతోపాటు సుదీర్ఘకాలం పనిచేస్తుందని ఆయన చెబుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా మార్కెటింగ్‌ కూడా విజయవంతంగా చేస్తున్నారు.


ఎటువంటి ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ లేకుండానే..
భగవాన్‌ తయారు చేసిన ఈవాటర్‌ రోబోట్‌ మిషన్‌లో ఎటువంటి ఎలక్ట్రానిక్‌ స్యూట్‌ కలిగిన డివైస్‌ ఉండదు.. పూర్తిగా మెకానికల్‌ డివైజ్‌. ఇంటిపైనున్న ట్యాంకులో నీళ్లు ఖాళీ అయ్యాక ఆటోమెటిక్‌గా మోటారు ఆన్‌ చేయడం.. అదే ట్యాంకులో నీళ్లు 25 శాతం ఖాళీ అయ్యాక ఆటోమెటిక్‌గా మోటారు ఆన్‌ అవ్వడం అంతా పీవీసీ పైపుల అమరిక ద్వారా స్విచ్‌ను ఆన్‌ ఆఫ్‌ చేస్తుంది. ట్యాంకులో నీళ్లు ఖాళీ అయిన పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ ఫ్లోట్‌ బాల్‌ కిందకు జారడం వల్ల పైన అమరికలో పైపు స్విచ్‌ను కిందకు నొక్కుతుంది. దీంతో స్విచ్‌ ఆన్‌ అయ్యి మోటారు ఆన్‌ అవుతుంది. మళ్లీ నీళ్లు నిండాక ప్లాస్టిక్‌ ఫ్లోట్‌ బాల్‌ పైకి లేచి పైప్‌ ద్వారా స్విచ్‌ను పైకి నొక్కుతుంది. దీంతో స్విచ్‌ ఆఫ్‌ అయ్యి మోటారు ఆగిపోతుంది.  


అయితే సబ్‌మెర్సిబుల్‌ మోటార్లుకు కేవలం ఆఫ్‌ అవుతుందని, ఈ వాటర్‌ రోబోటిక్‌ మిషన్‌ పూర్తిస్థాయిలో ఆన్‌ ఆఫ్‌ ఆటోమెటిక్‌గా పనిచేసేందుకు ప్రివెంటర్‌, మెగ్నటిక్‌ కాంట్రాక్ట్‌ర్‌ వినియోగించాలని భగవాన్‌ చెబుతున్నారు. బీకాం వరకు చదువకున్న భగవాన్‌ స్థానికంగా జ్యూయలరీ వ్యాపారం చేస్తుండగా కుమారుడు, కుమార్తె, కోడలు ముగ్గురూ డాక్టర్లు కావడం, సొంత ఊరిలోనే ఆసుపత్రి నిర్వహించడం విశేషం.