Drugs Illegal Delivery through Watermelons | పుచ్చకాయల ద్వారా 5 మిలియన్ డాలర్లకు పైగా విలువైన మెథాంఫేటమిన్ను అమెరికా కస్టమ్స్, అమెరికా బోర్డర్ ప్రొటెక్షన్ పోలీసులు కనుగొన్నారు. ట్రక్కును స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో మొత్తం 1220 ప్యాకేజీల ద్వారా రెండు టన్నులకు పైగా బరువున్న క్రిస్టల్ మిత్ అని పిలవబడే మెథాంఫెటమైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు బోర్డర్ ప్రొటెక్షన్ పోలీస్ (CBP) తమ ఎక్స్ అకౌంట్, పత్రికా ప్రకటనల ద్వారా వెల్లడించారు. ఆకుపచ్చ పుచ్చకాయల వలే కనిపించే ప్యాకేజీలలో చుట్టబడినట్టు వారు తెలియజేశారు. శాన్ డియాగో పోర్ట్ ఒటే మెసా వద్ద ఆ పుచ్చకాయలను తరలిస్తున్న ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
పార్సిల్లలో మెథాంఫేటమిన్
అమెరికా- మెక్సికో సరిహద్దులో ఒటే మెసాలో ట్రైలర్ను లాగుతున్న ట్రక్కును అధికారులు ఆపినట్లు US CBP తెలిపింది. 29 ఏళ్ల డ్రైవర్ పుచ్చకాయల షిప్మెంట్ను రవాణా చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే ఒక తనిఖీలో పార్సెల్లలో మెథాంఫేటమిన్ ఉన్నట్లు తేలింది.
దీంతో CBP అధికారులు మాదక ద్రవ్యాలతోపాటు, వాణిజ్య ట్రాక్టర్-ట్రైలర్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను తదుపరి విచారణ కోసం హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ కస్టడీకి అప్పగించారు.
ది గార్డియన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వారం క్రితమే అదే సరిహద్దు క్రాసింగ్లో దాదాపు 300 కిలోల మెత్ను తరలిస్తుండగా పోలీసులు కనుగొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనూ కాలిఫోర్నియాలో స్క్వాష్ రవాణాలో 6 టన్నుల మెత్ కూడా కనుగొన్నారు. గతేడాది మెక్సికో సరిహద్దు మీదుగా రవాణా చేస్తున్న జలపెనో పేస్ట్ డబ్బాలలో మెత్, కొకైన్ కనుగొన్నారు. పచ్చి బఠానీలు, పంచదార, పిండి, ఇతర స్వీట్ల రవాణాలో మాదక ద్రవ్యాలను దాచి సరఫరా చేస్తున్నట్టు ది గార్డియన్ పత్రిక కథనం ప్రకారం తెలుస్తోంది.
ఈ మాదక ద్రవ్యాలపై నిఘా, నిరోధం కోసం ఆపరేషన్ అపోలో ప్రారంభించారు. ఈ ఆపరేషన్ గత అక్టోబర్లో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రారంభమై ఏప్రిల్లో అరిజోనాకు విస్తరించింది. మాదకద్రవ్యాల సరఫరా, నిల్వలో నింధితులు అధునాతన మార్గాలను అనుసరిస్తున్నట్టు పోర్ట్ డైరెక్టర్ రోసా హెర్నాండెజ్ తెలిపారు. ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు తాము కూడా మెరుగైన మార్గాలను కనుగొనడం జరుగుతుందని ఆయన వివరించారు.