Yellow Alert To AP And Telangana Districts: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, ఉభయ గోదావరి, కర్నూలు, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


సోమవారం మధ్యాహ్నం వరకూ తీర ప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని చెప్పారు. అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణాతీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకూ అతివేగంగా అలలు వస్తాయని వెల్లడించారు. అటు, నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకూ పశ్చిమగోదావరి తీర ప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.


తెలంగాణలోనూ..


అటు, తెలంగాణలోనూ (Telangana) రాగల 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.


సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డిలో 7.5 సెంటీమీటర్లు, సిద్ధిపేట అర్బన్‌లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


Also Read: TTDP Committees: తెలంగాణలో టీడీపీ కమిటీలు రద్దు - స్థానిక నేతలకు అధినేత చంద్రబాబు కీలక ఆదేశాలు