Sri Krishna Janmashtami 2024 Recipes : కృష్ణాష్టమి సమయంలో కొన్నిరకాల ఫుడ్స్ తయారు చేసుకుంటారు. అలాంటివాటిలో జంతికలు కూడా ఒకటి. కేవలం కృష్ణాష్టమి సమయంలోనే కాకుండా స్నాక్స్​గా కూడా జంతికలు చేసుకోవచ్చు. వర్షాలు పడే సమయంలో కరకరలాడే మురుకులు తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అయితే నల్లని నువ్వులతో జంతికలు గుళ్లగా వచ్చేలా ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


వేయించిన శనగపప్పు - ముప్పావు కప్పు


బియ్యం పిండి - మూడు కప్పులు


కారం - అర టీస్పూన్


నల్లని నువ్వులు - 2 టేబుల్ స్పూన్స్


వామ్ము - అర టీస్పూన్


ఇంగువ - చిటికెడు


ఉప్పు - రుచికి తగినంత


నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్


వేడి నీళ్లు - 2 కప్పులు


నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత


తయారీ విధానం


వేయించిన శనగపప్పును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పౌడర్​గా చేసుకోవాలి. అనంతరం మిక్సింగ్​ బౌల్​లోకి దీనిని చల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. గరుకుగా ఉండే దానిని తీసేస్తే జంతికలు గుళ్లగా వస్తాయి. బియ్యం పిండిని కూడా దానిలోనే చల్లించుకోవాలి. ఈ పిండిలో కారం, నల్ల నువ్వులు, వామ్ము, ఇంగువ, ఉప్పు, నెయ్యిని వేయాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో వేడినీళ్లు వేసి మిక్స్ చేసుకోవాలి. దానిని గిన్నెలోకి ఒత్తుకోవాలి. దీనిపై కాటన్ క్లాత్ వేసి 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 


అనంతరం పిండిని మరోసారి గట్టిగా ఒత్తుతూ కలపాలి. ఇప్పుడు పిండికి సరిపడేట్టు కొంచెం కొంచెంగా నీళ్లు వేసి పిండిని కలుపుకోవాలి. జంతికలకు సరిపడేలా పిండిని మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా మెత్తగా కలుపుతూ.. ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు జంతికల మౌల్డ్ తీసుకోవాలి. మీకు నచ్చిన షేప్​ ఉన్న మౌల్డ్ తీసుకోవాలి. ఇప్పుడు దానికి నూనె రాసి పెట్టుకోవాలి. 



ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత మంటను మీడియంలో ఉంచాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని మౌల్డ్​లోకి వేసుకోవాలి.  ఓ ప్లేట్​పై నూనె రాసి.. దానిపై జంతికలు వేసుకుని.. నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న జంతికలను రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. జంతికలు క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. వీటిని నూనె నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. 


Also Read : కృష్ణాష్టమి స్పెషల్ నేతి హల్వా.. రవ్వతో ఇలా టేస్టీగా చేసి ప్రసాదంగా పెట్టేయండి


అంతే వేడి వేడి క్రిస్పీ జంతికలు రెడీ. వీటిని కృష్ణాష్టమి స్పెషల్​గా చాలామంది చేసుకుంటారు. అయితే స్నాక్స్​గా కూడా వీటిని చేసుకోవచ్చు. వర్షం పడే సమయంలో వీటిని చేసుకుని ఛాయ్​కి జోడిగా తీసుకోవచ్చు. మరికొందరు వీటిని ఛాయ్​లో వేసుకుని కూడా తింటారు. పిల్లల నుంచి పెద్దలవరకు వీటిని ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా వీటిని ట్రై చేసి.. హాయిగా స్నాక్స్​గా ఎంజాయ్ చేయవచ్చు. 


Also Read : కృష్ణాష్టమి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డూ.. పంచదార లేకుండా హెల్తీగా చేసేయండిలా