Dry Fruits Kobbari Laddu Recipe : కృష్ణాష్టమి( Sri Krisha janmashtami 2024) సమయంలో మీరు ప్రసాదంగా కొబ్బరి లడ్డూ చేయొచ్చు. అయితే డ్రై ఫ్రూట్స్​తో ఈ లడ్డులూ చేస్తే ఇవి మరింత రుచిని ఇవ్వడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కాబట్టి వీటిని ప్రసాదంగానే కాకుండా.. హెల్తీగా ఉండేందుకు కూడా తయారు చేసుకోవచ్చు. ఇంతకీ దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్


బాదం - అరకప్పు


జీడిపప్పు - అరకప్పు


వాల్​నట్స్ - పావు కప్పు


సన్​ఫ్లవర్ సీడ్స్ - రెండు టేబుల్ స్పూన్స్


గుమ్మడి గింజలు - రెండు టేబుల్ స్పూన్స్


ఎండు ద్రాక్ష - 2 టేబుల్ స్పూన్స్


నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్ 


కొబ్బరి తురుము - 4 కప్పులు 


బెల్లం తురుము - 2 కప్పులు


గసగసాలు -  1 టేబుల్ స్పూన్స్


యాలకుల పొడి - అర టీస్పూన్


తయారీ విధానం


ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోండి. దానిలో నెయ్యి వేయాలి. అది కాస్త వేడి అయ్యాక దానిలో బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, వాల్​నట్స్, గుమ్మడి గింజలు, సన్​ఫ్లవర్ సీడ్స్, ఎండుద్రాక్ష వేయాలి. ఇప్పుడు మంటను సిమ్​లో ఉంచి... వాటిని రోస్ట్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని క్రంచీగా మారేవరకు వేయించుకోవాలి. ఆ సమయంలో వీటినుంచి మంచి అరోమా కూడా వస్తుంది. కాస్త రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు కడాయిలో మరో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. అది వేడి అయ్యాక దానిలో ఫ్రెష్​గా తురిమి పెట్టుకున్న నాలుగు కప్పుల కొబ్బరి తురుము వేయాలి. దీనిని ఓ 5 నిమిషాలు మంటను సిమ్​లో ఉంచి వేయించుకోవాలి. ఏమాత్రం పక్కకి వెళ్లినా కొబ్బరి మాడిపోయే ప్రమాదముంది కాబట్టి.. దగ్గరే ఉండి.. కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలోని తడి ఆరి.. మంచి అరోమా వస్తుంటుంది. ఆ సమయంలో రెండుకప్పుల బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. 


కొద్దిసేపటి తర్వాత బెల్లం కరగడం మొదలవుతుంది. ఇది కొబ్బరిలో కలుస్తూ.. మంచి రంగునిస్తూ పూర్తిగా కరుగుతుంది. మంటను కాస్త మీడియంలో ఉంచి.. కొబ్బరిని, బెల్లాన్ని కలిపి కాస్త నొక్కుతూ రోస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల బెల్లం బాగా కొబ్బరిలో కలుస్తుంది. బెల్లం పూర్తిగా కరిగి షేప్స్ చేసుకోవడానికి వీలుగా మారుతుంది. ఇప్పుడు దానిలో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలు కూడా వేసి కలపాలి. 



చివర్లో యాలకుల పొడి వేయాలి. అన్ని కలిసేలా ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. పదార్థాలన్ని మిక్స్ అయినా తర్వాత స్టౌవ్​ నుంచి కడాయిని దించి కాస్త చల్లారనివ్వాలి. మిశ్రమం కాస్త వేడిగా ఉండగానే చేతులకు కాస్త నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలుగా ఒత్తుకోవాలి. అంతే టేస్టీ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ. వీటిని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. అయితే మీరు హెల్త్​ కోసం వీటిని తయారు చేసుకుని రెగ్యూలర్​గా తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. 


Also Read : కృష్ణాష్టమి స్పెషల్ నేతి హల్వా.. రవ్వతో ఇలా టేస్టీగా చేసి ప్రసాదంగా పెట్టేయండి