JAC Of Telangana Employees : తెలంగాణలో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావించింది. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చిరెడ్డి ఛైర్మన్ గా ఉద్యోగుల జేఏసీ పురుడు పోసుకుంది. వారసత్వ నాయకత్వంలో నడుస్తున్న టీజీవో, టీఎన్జీవో ఉద్యోగుల జేఏసీకి చెక్ పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు అయింది. హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సి.పి.ఎస్., పెన్షన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ గా డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చిరెడ్డిని 65 సంఘాల నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు ఆవశ్యకత
గత ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, కార్మికుల హక్కులు హరించినా నాడు ఉన్న ఉద్యోగుల జేఏసీ నాయకులు నోరు మెదపలేదని పలువురు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాలను, సంఘాల నేతలను అణిచివేసినప్పుడు మాట్లాడలేదన్నారు. మొదటి తేదీన ఇవ్వాల్సిన జీతాలను నెల పొడవునా పదేళ్ల పాటు ఇచ్చినప్పుడు, వెంటనే ఇవ్వాల్సిన మూడు డీఏలను ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉంచినప్పుడు జేఏసీ నాయకులు స్పందించలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, వీఆర్వో , వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసినప్పుడు, ఇతర డిపార్ట్మెంట్లను సైతం ఉనికి లేకుండా చేసినప్పుడు, ఉద్యోగులను రకరకాల ఇబ్బందులు పెట్టినప్పుడు జేఏసీ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయి. ఉద్యోగుల కష్టనష్టాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంపూర్ణ అవగాహన ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, సంక్షేమం, ఆరోగ్యం, హౌసింగ్, ఇతర సమస్యలు పరిష్కరించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయింది.
ఉద్యోగుల సంక్షేమమే మా ఎజెండా : వి.లచ్చిరెడ్డి
లచ్చిరెడ్డి మాట్లాడుతూ..‘‘గత ప్రభుత్వ పదేళ్ల పాలనాకాలంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పొరపాట్లు, ఉద్యోగులకు జరిగిన అన్యాయాలు మళ్లీ పునరావృతం కావొద్దనే ఆలోచనతోనే మేమంతా ఏకతాటిపైకి వచ్చాం. వారసత్వంగా వస్తున్న ఉద్యోగ సంఘాలు గతంలో చేసిన ఘనకార్యాలను చూసి ఆవేదనతో మేము ఏకమయ్యాం. భవిష్యత్తులో ఆ సంఘాలు మళ్లీ ఉద్యోగులను మోసం చేయొద్దని, వాటి గుత్తాధిపత్యం ఉండొద్దనేది మా అందరి ఆలోచన. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ నుంచి 25 వేల మంది ఉద్యోగులను ఇతర శాఖల్లోకి పంపించారు. ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఉద్యోగాలు పోయినా ఆ సంఘాలు పట్టించుకోలేదు. 610 జీవో అన్యాయంపై పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే, వచ్చిన తెలంగాణలో 317 జీవో కింద 50 వేల ఉద్యోగాలు పోతున్నా ఆ సంఘాలు మాట్లాడలేదు.
హెల్త్ పాలసీ తెస్తామన్నరు
ఉద్యోగులకు హెల్త్ పాలసీ తెస్తామని ఆ సంఘాలు 2014లో హడావుడి చేసినా పాలసీ తేలేదు. పదోన్నతుల క్యాలెండర్ తెస్తామని చెప్పినా తేలేదు. ఉద్యోగుల హౌజింగ్‌కు సంబంధించి అసలు వారికి ఏ అవగాహన, విధానం లేదు. ఇలా గత పదేళ్లలో ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ అన్యాయం జరుగుతున్నా మాట్లాడని సంఘాలు ఇప్పుడు మళ్లీ ఉద్యోగులను ఉద్దరిస్తామని ముందుకొచ్చాయి. పదేళ్లలో ఉద్యోగ, ఆర్టీసీ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసినా, ఆర్టీసీ, ఉద్యోగ నాయకులను ఇబ్బందిపెట్టినా ఆ సంఘాలు ఏనాడూ మాట్లాడలేదు. ఆర్టీసీ కార్మికులు మరణిస్తున్నా పట్టించుకోని సంఘాలు ఇప్పుడు ఉద్యోగులకు న్యాయం చేస్తామని అంటున్నాయి. గత పదేళ్లలో ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా, స్వేచ్ఛ లేకపోయినా నోరెత్తని సంఘాలు, ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో స్వేచ్ఛ దొరికిందని బయటకువస్తున్నాయి. ఈ సంఘాల నాయకులు ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఉద్యోగులు ఒకవైపు, ఉద్యోగ సంఘాల నేతలు మరోవైపు ఉన్నారు. కేవలం ఉనికిని చాటుకునేందుకే ఆ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. మేము ఆ సంఘాలకు పోటీగా ముందుకు రావడం లేదు. ఆ సంఘాల గుత్తాధిపత్యం రాచరికంలా ఉండొద్దని, ఉద్యోగులను పట్టించుకోకుంటే ఇక కుదరదని చెప్పేందుకే ఏకమయ్యాం.
సమస్యలు తెలుసుకుంటాం.. పరిష్కారాన్ని సాధిస్తాం
ఇప్పటివరకు వారసత్వం సంఘాలుగా చెప్పుకుంటున్నవి మూస పద్ధతిలో వెళ్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. ఈ మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. ఇందుకు గానూ ఉద్యోగుల వైద్యం, హౌజింగ్, వెల్ఫేర్ వంటి అంశాలపై ప్రత్యేక కమిటీలు వేసి, అందరి అభిప్రాయాలు తీసుకొని విధానాలకు రూపకల్పన చేస్తాం. వీటిని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు జరిగేలా చూస్తాం. డిపార్ట్‌మెంట్‌లవారీగా ఉద్యోగుల సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యోగుల సంక్షేమం విషయంలోనూ సరికొత్త పంథాలో ముందుకెళ్తాం.’’ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ, విద్య, న్యాయ, విద్యుత్, మెడికల్, కమర్షియల్ టాక్స్, రెవెన్యూ, జలమండలి, మున్సిపల్, వ్యవసాయ, సీపీఎస్ ,ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, పిసిబి, తదితర ప్రభుత్వ శాఖల, సంస్థల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.