అప్పటివరకు అతడు బాగానే ఉన్నాడు. అకస్మాత్తుగా ఏం చూశాడో ఏమో.. గిరగిరా తిరుగుతూ ప్లాట్‌ఫారమ్ మీద నుంచి నేరుగా కదులుతున్న రైలు కింద పడ్డాడు. చివరికి దుర్మరణం చెందాడు.
ఈ ఘటన ఆగ్రాలోని రాజా కి మండీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. మండీ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ జీఆర్పీ కానిస్టేబుల్ రింగెల్ సింగ్ (34) ఆదివారం ఉదయం 9.25 గంటలకు ప్లాట్‌ఫారమ్ మీద నిలుచుని ఉన్నాడు. అదే సమయంలో ఓ గూడు రైలు బండి వచ్చింది. అకస్మాత్తుగా ఏమైందో ఏమో.. రింగెల్ ఏదో చూస్తున్నట్టుగా తన చుట్టూ తాను గిరగిరా తిరిగాడు. ఆ తర్వాత అదుపుతప్పి ప్లాట్‌ఫారం మీద నుంచి నేరుగా రైలు పట్టాల మీదపడిపోయాడు. దీంతో రైలు అతడి మీద నుంచి వెళ్లిపోయింది.
ప్లాట్‌ఫారంపై అతడికి సమీపంలో కూర్చున్న వ్యక్తి ఇదంతా దగ్గరుండి చూశాడు. అతడు రైలు కింద పడిపోతున్నా ఆ సీటు నుంచి కదల్లేదు. అయితే, రింగెల్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఓ రైల్వే అధికారి ఇదంతా చూసి పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చాడు. అప్పటికిగానీ ఆ సీటులో కూర్చున్న వ్యక్తి కదల్లేదు. రైల్వే అధికారి దగ్గరకు వెళ్లి చూసేసరికే ఘోరం జరిగిపోయింది. రింగెల్ రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్లాట్‌ఫారంపై ఉన్న సీసీటీవీ కెమేరాలో ఇదంతా రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: ఆమె జుట్టునే గూడుగా మార్చుకున్న పక్షి, 84 రోజులు అక్కడే తిష్ట!
ఈ వీడియో చూసిన నెటిజనులు రింగెల్‌కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రింగెల్ ఎనిమిది నెలల కిందటే డిప్యుటేషన్ కింద ఈ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఆయన రైలు కింద పడటానికి ముందు అలా ఎందుకు ప్రవర్తించాడనేది తెలియరాలేదు. బహుశా, అతడికి కళ్లు తిరిగి ఉండవచ్చని, దానివల్ల నియంత్రణ కోల్పోయి రైలు కింద పడిపోయి ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే, సమీపంలో ఉన్న వ్యక్తి వెంటనే స్పందించి ఉంటే అతడు ప్రాణాలతో బయటపడేవాడని నెటిజనులు అంటున్నారు.
Also Read: స్మార్ట్ ‘బొద్దింకలు’ - మనుషులను రక్షిస్తాయ్, చెప్పిన పని చేస్తాయ్! ఇదిగో ఇలా