Electricity Bill : ఎప్పుడూ వచ్చే దాని కన్నా ఒక్క నెల ఎక్కువ కరెంటు బిల్లు వస్తేనా తెగ హైరానా పడిపోతూంటాం. ఈ నెల ఎందుకు ఎక్కువొచ్చిందా అని ఆలోచిస్తుంటాం. సాధారణంగా ఒక ఇంటికి వచ్చే కరెంటు బిల్లు రూ.1000 - 3వేల వరకు రావొచ్చు. ఇంకొన్ని సార్లు వాడకాన్ని బట్టి మరికొంత ఎక్కువ ఉండొచ్చు. ఎంత వాడినా అది దాదావు రూ.5వేల లోపే ఉంటుంది. కానీ ఓ వ్యక్తి ఇంటికి ఏకంగా రూ.210 కోట్ల బిల్లు వేశారు. దీంతో అవాక్కైన ఆ వ్యక్తి వెంటనే అధికారులను సంప్రదించి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో విద్యుత్ శాఖ ఒక వ్యాపారవేత్తకు రూ.210 కోట్ల భారీ బిల్లును పంపింది. భోరంజ్ సబ్ డివిజన్ పరిధిలోని బెహ్‌దవిన్ జట్టన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాంక్రీట్ ఇటుకల తయారీ పరిశ్రమను నిర్వహిస్తోన్న లలితా ధీమాన్ అనే చిన్న తరహా వ్యాపారి రూ.210 కోట్లకు పైగా విద్యుత్ బిల్లు రావడంతో కంగుతిన్నారు. బిల్లుపై కచ్చితమైన మొత్తం రూ. 210,42,08,405 కావడం వారిని షాక్‌కు గురిచేసింది. కాంక్రీట్‌తో సిమెంట్ ఇటుకలను తయారు చేస్తున్న లలిత్ ధీమాన్, వారి కుమారుడు ఆశిష్ ధిమాన్‌లకు విద్యుత్ బోర్డు ఉద్యోగి భారీ బిల్లును అందజేశారు. తేడాను గుర్తించిన వారు వెంటనే విద్యుత్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బిల్లును రూ.4,047కు సవరించారు.
Also Read : Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో చిక్కుకున్న యూట్యూబర్ - సోషల్ మీడియాలో వీడియో రిలీజ్
అసలేమైందంటే..
అధికారులకు లలిత్ ధీమాన్ ఫిర్యాదు చేయడంతో.. వారు విద్యుత్ బిల్లుల రికార్డును పరిశీలించారు. సాంకేతిక లోపం వల్లే ఇంత బిల్లు వచ్చిందని భోరంజ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎస్‌డిఓ అనురాగ్ చందేల్ అసలు విషయం తెలియజేశారు. ఫిర్యాదు అందిన తర్వాత, బిల్లును సరిదిద్దారు. సవరించిన బిల్లులో 836 యూనిట్ల విద్యుత్ ను వినియోగించినట్టు తెలిసింది. ఏదైమైనా బిల్లు రూ.210కోట్లు కాదని, రూ.4,047 అని సవరించడంతో ఆ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై పలు రకాలు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలోనూ..
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన ఉదంతాలున్నాయి. 2024లో గుజరాత్ లోని వల్సాద్ ప్రాంతంలో టైలరింగ్ దుకాణం నడిపే అన్సారీ అనే వ్యక్తి ఇంటికి రూ.86 లక్షల బిల్లు వచ్చింది. దీంతో కంగుతున్న ఆయన.. అధికారులను సంప్రదించారు. డిస్కం అధికారులు అతని దుకాణానికి చేరుకుని మీటర్ ను పరిశీలించారు. సాంకేతికం లోపం వల్లే ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వచ్చిందని స్పష్టం చేశారు. మీటర్ రీడింగ్ కు మరో రెండు అంకెలు చేరడంతో ప్రింట్ తప్పుగా పడిందని తెలిపారు.